బాబ్రీ మసీదు ఘటనకు 28 ఏళ్లు. మొత్తం 49 మంది నిందితులు. అందులో 17 మంది మరణించగా.. మిగిలింది 32 మంది ప్రముఖులు. వీరిలో ఒకరు మాజీ ఉప ప్రధాని, మిగిలినవారు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు. దర్యాప్తులో పాల్గొన్న ప్రత్యక్ష సాక్ష్యులు 351మంది. ఇంతటి చారిత్రక బాబ్రీ తీర్పునకు లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వేదికైంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే...
అసలేం జరిగింది?
1992, డిసెంబర్ 6న లక్షలాదిమంది కరసేవకులు.. సుప్రీం కోర్టు అనుమతితో కర సేవ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బాబ్రీ మసీదు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస చెలరేగిన వెంటనే.. స్థానిక రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఘటనలో లక్షలాదిమంది కర సేవకులను నిందితులుగా చేర్చారు. అయితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మరో 10 నిమిషాల తర్వాత 6:25కు ఎల్కే అడ్వాణీ సహా మరికొంత మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు.
రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరం రెండవ రోజు ఈ కేసు సీబీసీఐడీకి బదిలీ అయ్యింది. రాష్ట్రంలో చెలరేగిన ఈ విధ్వంసానికి బాధ్యతవహిస్తూ.. నాటి యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటినుంచి ఈ అంశం రాజకీయమైంది.
ఇక దర్యాప్తులో భాగంగా సీబీసీఐడీ ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. తర్వాత ఈ కేసు పూర్తిగా సీబీఐ చేతికి వెళ్లింది.
అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రెండు చోట్ల విచారణ మొదలైంది. రాయబరేలీలో ఈ కేసులోని ప్రముఖులకు సంబంధించిన విచారణ జరుగుతుండగా.. లఖ్‌నవూలో ఇతర నిందితులకు సంబంధించిన కేసు నడుస్తుండేది. అయితే, సుప్రీం కోర్టు రాయబరేలీ కేసును కూడా లఖ్‌నవూకు మార్చేసింది. ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులోనే పూర్తి స్థాయిలో.. వివిధ కోణాల్లో ముగిసిన దర్యాప్తు, విచారణల అనంతరం సెప్టెంబర్ 30న తీర్పు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ కేసు విచారణ తీవ్రమైన నేరానికి కుట్రకు సంబంధించిన కోణంలో జరిగింది. అయితే, 2001లో ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అలహాబాద్ హైకోర్టు 2010లో ఈ తీర్పును సమర్థించింది. కానీ 2017లో ఈ కేసుకు సంబంధించి అప్పీళ్లు రాగా హైకోర్టు తీర్పు సంస్పెండ్ చేస్తూ మరోసారి విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రత్యేక జడ్జి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తూ రెండేళ్లలో తీర్పు వెలువరించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. ఈ ఏడాది అగస్టు 31న తీర్పు రావాల్సింది. సీబీబీ మరో నెల రోజులు గడువు కోరటం వల్ల సెప్టెంబర్ 30కి వాయిదా పడింది.
నిందితులు:
ఎల్ కే అడ్వాణీ,మురళీ మనోహర్ జోషి, సుధీర్ కక్కర్, సతీష్ ప్రధాన్, రాం చంద్ర ఖత్రి, సంతోష్ దుబే, కల్యాణ్ సింగ్, ఉమా భారతి, రాం విలాస్ వేదాంతి, వినయ్ కతియార్, ప్రకాశ్ శర్మ, గాంధీ యాదవ్, జై భాన్ సింగ్, లల్లూ సింగ్, కమలేశ్ త్రిపాఠి, బ్రిజ్ భూషన్ సింగ్, రాంజీ గుప్తా, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, సాక్షి మహారాజ్, వినయ్ కుమార్ రాయ్, నవీన్ భాయ్ శుక్లా, ధర్మదాస్, జై భగవాన్ గోయల్, అమరనాథ్ గోయల్, సాధ్వి రితంభర, పవన్ పాండే, విజయ్ బహదూర్ సింగ్, ఆర్ ఎం శ్రీవాస్తవ, ధర్మేంద్ర సింగ్ గుజ్జర్, ఓం ప్రకాశ్ పాండే, ఆచార్య ధర్మేంద్ర
మరణించిన నిందితులు:
పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, రాం నారాయణ్ దాస్, డీబీ రాయ్, లక్ష్మీ నారాయణ దాస్, హర్గోవింద్ సింగ్, రమేష్ ప్రతాప్ సింగ్, దేవేంద్ర బహదూర్, ఆశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్, మహంత్ జగదీశ్ ముని మహరాజ్, వైకుంఠ్ లాల్ శర్మ, సతీష్ కుమార్ నాగర్, బాలా సాహెబ్ ఠాక్రే.
ఇదీ చూడండి:-'బాబ్రీ' పరిమాణంలోనే అయోధ్య మసీదు: ఐఐసీఎఫ్