తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా : బాబాయ్‌ దీవెనలతో ఎదిగిన 'దాదా' - azith pawar latest news

అజిత్‌ అనంతరావు పవార్‌ అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు...  అయితే అజిత్‌ దాదా అంటే అందరికీ తెలుసు.. దాదా అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో చిరపరిచితమైన పేరు.. శరద్‌పవార్‌ అన్న అనంతరావు కుమారుడే అజిత్‌ పవార్‌... నేడు ఈయన పేరు దేశంలో సంచలనం సృష్టించింది.. భాజపాతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

బాబాయ్‌ దీవెనలతో ఎదిగిన ‘దాదా’

By

Published : Nov 23, 2019, 7:50 PM IST

Updated : Nov 23, 2019, 9:16 PM IST

అజిత్‌ పవార్‌... ఈయన పేరు ఇప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భాజపాతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన గురించి తెలుసుకుందాం..

పినతండ్రి అడుగుజాడల్లో..

అజిత్‌ పవార్‌ తండ్రి సినిమారంగంలో ఉండేవారు. ప్రఖ్యాత సినీ ప్రముఖుడు శాంతరామ్‌ దగ్గర సినిమా నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించేవారు. అయితే ఆయన కుమారుడు అజిత్‌ పవార్‌ మాత్రం తన పినతండ్రి శరద్‌ పవార్‌ ఉన్న రాజకీయ రంగం వైపు మొగ్గు చూపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న శరద్‌ పవార్‌ 1991లో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లారు. అనంతరం తిరిగి మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శరద్‌ పవార్‌ వారసుడిగా అజిత్‌కు ప్రచారం లభించింది. దీంతో మహారాష్ట్రలో అజిత్ పవార్‌ ప్రాబల్యం పెరిగింది. బారామతి నుంచి అజిత్‌ పవార్‌ వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఆయన వైఖరిపై విమర్శలు వచ్చినా పట్టించుకునేవారు కాదు. శరద్‌ పవార్‌ సైతం అజిత్ రాజకీయ ఎదుగుదలకు చేయూతనిచ్చారు.

వివాదాలకు కేంద్రబిందువు..

అజిత్‌ పవార్‌ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 1999లో శరద్‌పవార్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో విభేదించి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీని నెలకొల్పారు. మహరాష్ట్రలోని పశ్చిమప్రాంతాలైన సంగ్లీ, కొల్హాపూర్‌, పుణె, సతారా.. తదితర ప్రాంతాల్లో పార్టీ ప్రాబల్యం బాగా విస్తరించింది. 1999 నుంచి 2014 వరకు మూడు పర్యాయాలు కాంగ్రెస్‌-ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. 2009లో ఎన్‌సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా ఉన్న ఛగన్‌ భుజ్‌బల్‌ను తొలగించి అజిత్‌కు పట్టం కట్టారు. ఒకసారి మహరాష్ట్రలో రైతులు ప్రాజెక్టుల్లో నీళ్ల లేకపోవడంపై ఆయనను నిలదీశారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు రూ. 25 వేల కోట్ల మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆయనను నిందితుడిగా దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి.

సన్నిహితులకు దాదాగా..

ఎన్‌సీపీలో అభిమానులు అతన్ని దాదాగా (పెద్దన్న) పిలుస్తారు. శరద్‌పవార్‌ కేంద్ర రాజకీయాల్లో ఉండటంతో పార్టీలో అజిత్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే పార్టీ శ్రేణులతో పాటు పలువురు నేతలు అజిత్‌కు మద్దతిస్తున్నారు. తాజాగా పార్టీని చీల్చి భాజపా కూటమిలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శరద్‌ పవార్‌ వారసత్వాన్ని 60 ఏళ్ల దాదా కొనసాగిస్తాడని పలువురు అభిమానులు చెబుతుండటం గమనార్హం.

ఇదీ చూడండి : లైవ్​: ఉత్కంఠగా 'మహా' రాజకీయం- 'పరీక్ష'పై పార్టీల వ్యూహాలు

Last Updated : Nov 23, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details