సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు సభ్యులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని సభలో ప్రకటన చేశారు. జులై 25న భాజపా ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఆజం అసభ్య పదజాలం ఉపయోగించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఆజం క్షమాపణలు తెలపాలని తీర్మానించారు. అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన స్పీకర్ ఓం బిర్లా ఆ మేరకు ఆజంతో సభలో క్షమాపణలు చెప్పించారు.
ఆజం ప్రకటనలో కొన్ని పదాలు వినిపించలేదని, మరోసారి తెలపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తన క్షమాపణను చదివి వినిపించారు ఆజం.
"నా మాటలు సభకు, స్పీకర్‌కు వ్యతిరేకంగా ఉండవు. రెండు సార్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను. నాలుగు సార్లు మంత్రిగా ఉన్నాను. తొమ్మిదిసార్లు ఎంపీగా పనిచేశాను. నా భాష, వ్యవహారశైలి సభకు మొత్తం తెలుసు. ఇదంతా తెలిసి కూడా నా మాటలు తప్పని భావిస్తే నా క్షమాపణలు తెలుపుతున్నా. గౌరవ సభ్యురాలు నా సోదర సమానురాలని నేను ముందే చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే..ఎవరికైనా నా మాటల పట్ల అభ్యంతరముంటే క్షమాపణలు."