కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇదే బాటలో భారత్‌లోని ఆయుష్ విభాగం కూడా కీలక పరిశోధనల్లో భాగస్వామ్యమైంది. జనరిక్ మందులే కాకుండా ఆయుర్వేదంతోనూ కొవిడ్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను ఈటీవీ భారత్‌కు ప్రత్యేకంగా వెల్లడించారు ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్. డీసీ కటోచ్
సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో...
"సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సహాయంతో ఆయుష్, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా.. నాలుగు ఆయుర్వేద ఔషధాలతో ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం. అవి అశ్వగంధ, యష్టిమధు(ములేతి), గుడూచి+పిప్పలి(గిలోయ్), పాలీ హెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్-64). కరోనా కట్టడిలో ఆయుర్వేదంతో వచ్చే ఫలితాలను పరిశీలిస్తున్నాం. ఈ మందులు మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి.. వైరస్ శరీరంలోకి వైళ్లకుండా నియంత్రిస్తాయి. అయితే ఇవి ఏ మేరకు రక్షణ కల్పిస్తున్నాయి? అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం" అని తెలిపారు కటోచ్.
"భారత్‌లో కరోనా కట్టడి గురించి ఆయుష్ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో మనిషి ఎలా వ్యాధి నుంచి రక్షించుకోవచ్చో చెప్పాం. దీనికి మంచి స్పందన లభించింది. అందరూ ఆమోదయోగ్యమని తెలిపారు"
-- డాక్టర్.కటోచ్
మరి బాధితులపై..?
దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రఖ్యాత వైద్య సంస్థలు ఆయుర్వేదంతో క్లినికల్ ట్రయల్స్‌లో భాగమయ్యాయని చెప్పారు ఆయుష్ ఆర్&డీ టాస్క్‌ఫోర్స్ సారథి డాక్టర్ భూషణ్ పత్వర్ధన్. ప్రస్తుతం వైద్య నిపుణులు రెండు అంశాలపై ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. సార్స్-కోవ్-2ను ముందస్తు నియంత్రణకు అశ్వగంధ ఏ మేరకు ఉపయోగపడుతుంది.? హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే కొవిడ్-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో అది ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు.