కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత ఆరోగ్య బీమా పథకం- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో 19 రకాల చికిత్స ప్యాకేజీలను జత చేయాలనే ప్రతిపాదనను ఆయుష్ మంత్రిత్వశాఖ పంపినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులకు సంబంధించిన నివేదికను జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థకు అందించినట్లు ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు.
ఆయుష్ చికిత్సకు సంబంధించిన బీమాను పొడిగించే ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు నాయక్ పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి రూ. 325 కోట్లు నిధులను విడుదల చేశారు. నీతి ఆయోగ్, ఇన్వెస్ట్ ఇండియా సహాయంతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ రీసెర్చ్ కోసం పథకాన్ని రూ.490 కోట్ల వ్యయంతో తీసుకొచ్చారు. దీని ద్వారా ఆధునిక వైద్యంతో పరిష్కరించలేని వాటిని ఆయుష్ పద్దతి ద్వారా నిర్మూలించవచ్చని తెలిపారు కేంద్ర మంత్రి.