రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో దేశంలో లౌకికవాదం బలపడుతుందా? చరిత్రలో ఎప్పుడో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలంటూ ప్రార్థనా స్థలాలపై వివాదాలకు పోకుండా రాజకీయపక్షాలు, సంస్థలు ఇకనైనా నడచుకుంటాయా? మూడు దశాబ్దాల అపనమ్మకాలు, అపోహల చరిత్ర క్రమేపీ కనుమరుగవుతుందా? సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరవాత పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలు ఏ వైపు నుంచి రాకపోవడంతో ఈ ప్రశ్నలు చాలామందిలో ఉదయించాయి.
సర్వోన్నత న్యాయస్థానం తన 1,100 పేజీల తీర్పులో లౌకికవాదం గురించి చాలా విషయాలు ప్రస్తావించింది. భవిష్యత్తులో ప్రార్థనాలయాలపై వివాదాలు తలెత్తకుండా ఉండటానికి వీలుగా కొన్ని కీలక విషయాలను స్పష్టంచేసింది. మధ్యయుగాల నాడు తమ ప్రార్థనాస్థలం విషయంలో అన్యాయం జరిగిందనో, లేక దాన్ని వేరే మతానికి చెందిన వారు ఆక్రమించారనే ఆరోపణలతో ఏ విధమైన బలవంతపు చర్యలకు ఒడిగట్టినా అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమేనని తేల్చిచెప్పింది.
బాబ్రీమసీదును కూల్చివేయడాన్ని తాత్కాలిక ఆవేశంతో చేసిన చర్యగా భావించలేదు. పనిగట్టుకుని కూల్చివేసిన ఘటనగానే చూసింది. న్యాయస్థానాల్లో కేసులు పెండింగులో ఉండగా 450 ఏళ్ల క్రితం నిర్మాణమైన ప్రార్థనాలయం నుంచి బలవంతంగా ముస్లిములను గెంటివేయడంగానే దాన్ని వ్యాఖ్యానించింది. సమన్యాయ పాలనకు కట్టుబడ్డ లౌకికవాద దేశంలో అలా జరిగి ఉండకూడదనీ స్పష్టీకరించింది. ఈ కారణంగానే వారికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వకపోతే న్యాయం జరిగినట్లుగా భావించలేమని తీర్పులో వ్యాఖ్యానించింది.
సాక్ష్యాధారాలే గీటురాయి....
లౌకికవాదాన్ని చులకనచేస్తూ, దాన్ని పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామంటూ విమర్శలు చేసే ఒక వర్గం దేశంలో ఎప్పటినుంచో ఉంది. తాముంటున్న దేశాన్ని కర్మభూమిగా మాత్రమేగాక పుణ్యభూమిగా భావించనివారు... పుణ్యస్థలం కోసం మరో భూభాగం వైపు చూసేవారు జాతి సంస్కృతిలో ఎన్నటికీ భాగం కాలేరన్న విచిత్ర వాదన 1920ల నుంచి ఉంది.
ఇటీవల మూడు దశాబ్దాల్లో అది బాగా బలపడింది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి జీవించడం, వాటి ప్రకారం రాజకీయ ఆలోచనలు కలిగిఉండటం సరిపోదనేవారూ ఉన్నారు. తరతరాలుగా ఉన్న సంస్కృతి నుంచి స్ఫూర్తిపొందకుండా జాతీయతా భావం తలెత్తదనీ గట్టిగా విశ్వసించే ఆలోచనాపరుల సంఖ్యా తక్కువేమి కాదు. ఇక రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదం దేశవ్యాప్తంగా వాదోపవాదాలకు దారితీసిన తరవాత అసలు ఏది లౌకికవాదం అన్న అంశంపై పెద్దయెత్తునే చర్చలు మొదలయ్యాయి. కుహనా లౌకికవాదం అనే పదం రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం సంపాదించుకుంది.
1,500 గజాల వివాదాస్పద భూమిపై హక్కులు ఎవరికి ఇవ్వాలన్నది తేల్చడానికి విశ్వాసం, నమ్మకాలను ప్రాతిపదికగా తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పులో పలుచోట్ల స్పష్టంచేసింది. లౌకికవాదం, సమన్యాయపాలన, చట్టబద్ధ సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పునిచ్చామని పేర్కొంది. మందిర్- మసీదు వివాదం దేశాన్ని రాజకీయంగా కుదిపేయడమే కాదు, లౌకికవాదాన్ని ఒడుదొడుకులకు గురిచేసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లౌకిక వాదం గురించి లోతైన వివరణలు, వ్యాఖ్యలు చేసింది. లౌకిక వాదాన్ని ఎవరికి వారు ఆచరించే ఒక నీతిగా, ఒక దృక్పథంగా సుప్రీంకోర్టు చూడలేదు.
అన్ని మతాలను సమదృష్టితో చూడటం లౌకికవాదానికి ప్రాణమని చెప్పడమే కాదు- రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అదొక భాగమనీ వ్యాఖ్యానించింది. పైగా దాన్ని అనుల్లంఘనీయ రాజ్యాంగసూత్రంగా పేర్కొంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌరులు లౌకికవాదానికి కట్టుబడాల్సిందేని స్పష్టంచేసింది. బొమ్మై కేసు విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులో లౌకికవాదంపై జస్టిస్ జీవన్‌రెడ్డి విస్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. మతసహనానికి సంబంధించి మనమానాన మనం ఉండే ఒక ఉదాసీన వైఖరిగా లౌకికవాదాన్ని అర్థంచేసుకోకూడదని ఆనాడు జస్టిస్ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మనం సాధించాల్సిన, పాటించాల్సిన మహోన్నత రాజ్యాంగ లక్ష్యంగా లౌకికవాదాన్ని వర్ణించడమే కాదు... రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అది అంతర్భాగమని ఆనాడు జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. దానికి వ్యతిరేకంగా ఎవరు ఏ అడుగు వేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమేనని అప్పట్లో జస్టిస్ జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.
భవిష్యత్తులో ప్రార్థనాస్థలాలపై వివాదాలు తలెత్తకుండా ఉండటానికి బాబ్రీమసీదు విధ్వంసానికి ముందు 1991లో తీసుకొచ్చిన ప్రార్థనాస్థలాల చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పులో పలుమార్లు ప్రస్తావించింది. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని మార్చకుండా నిషేధం విధిస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. తమ ప్రార్థనా స్థలాన్ని వేరే మతంవారు ఆక్రమించారనీ ఇప్పుడు దానికి బదులుతీర్చుకుంటామని ఎవరు ప్రయత్నించినా, ఆ దిశగా ఏ చర్యలు చేపట్టినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
న్యాయస్థానాలూ ప్రార్థనాస్థలాల స్వభావాన్ని మార్చే ఏ కేసునూ చేపట్టకుండా ఆ చట్టం నిషేధించింది. రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును మాత్రం ఈ చట్టం నుంచి మినహాయించారు. రాజ్యాంగ మౌలిక విలువైన లౌకికవాదాన్ని రక్షించడానికే ఆ చట్టాన్ని పార్లమెంటు చేసిందని నొక్కి మరీ చెప్పారు. దాన్ని ఎవరూ జవదాటకూడదని ధర్మాసనం స్పష్టీకరించింది. 1947 ఆగస్టు 15నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలు, నిర్మాణాలను కాపాడటం అన్ని స్థాయుల్లోని ప్రభుత్వాలపై ఉందని, 1991 నాటి చట్టం ఆ విధంగా నిర్దేశిస్తోందని చెప్పింది.