అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు ఉత్తర్ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో 16వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల ద్వారా వివాదాస్పద పోస్టులు తలెత్తకుండా 1600 ప్రాంతాల్లో వలంటీర్లను నియమించినట్లు జిల్లా ఎస్పీ ఆశిష్ తివారీ వెల్లడించారు. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
నాలుగంచెల భద్రత ప్రణాళిక..
ప్రజలను సంయమనం చేస్తూ ప్రోత్సహించేందుకు వలంటీర్లు పనిచేస్తారు. వారు ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకునేలా పలు వాట్సాప్ గ్రూపులను తయారు చేశారు. నాలుగంచెల భద్రతలో భాగంగా రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ జోన్లుగా విభజించారు. రెడ్, ఎల్లో జోన్లు పారా మిలిటరీ బలగాలు, గ్రీన్, బ్లూ జోన్లు సివిల్ పోలీసుల భద్రతలో ఉంటాయి. బలగాల వసతి కోసం ఇప్పటికే 700 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 50 ప్రాథమిక, 25 సీబీఎస్‌ఈ పాఠశాలలను స్వాధీనం చేసుకున్నారు.