కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వేదమంత్రాల నడుమ మధ్యాహ్నం భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి పునాదిరాయి వేయటాన్ని స్వాగతించారు పలువురు నేతలు. రాముడి ఆదర్శాలను పాటిస్తూ ముందుకు సాగాలని ఆశించారు.
ఆధునిక భారతావనికి చిహ్నంగా..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగటం భారత సామాజిక సామరస్యానికి ప్రతీకగా పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
" అయోధ్యలో రామాలయానికి భూమిపూజ జరగటం పట్ల అందరికీ నా శుభాకాంక్షలు. చట్టాలకు అనుగుణంగా ఆలయం నిర్మితమవుతోంది. ఇది భారతదేశ సామాజిక సామరస్యాన్ని, ప్రజల సంకల్పాన్ని సూచిస్తోంది. రామరాజ్య ఆదర్శాలకు సాక్ష్యంగా, ఆధునిక భారతానికి చిహ్నంగా ఈ ఆలయం ఉంటుంది."
- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి.
మోదీ బలమైన నాయకత్వాన్ని సూచిస్తోంది
" అయోధ్యలో శ్రీరాముడికి అద్భుతమైన ఆలయ నిర్మాణం చేపట్టడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని సూచిస్తోంది. చారిత్రక రోజు సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలను, వాటి విలువలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
ఆయనే మూలం..
శ్రీరాముడు అత్యున్నతమైన మానవ విలువలకు స్వరూపమని, క్రూరత్వం, ద్వేషం, అన్యాయం వంటివి ఆయనలో మచ్చుకైన కనిపంచవన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మన మనసులో నాటుకుపోయిన మానవతావాదానికి ఆయనే మూలమని చెప్పారు.
మన దేశం గొప్పది..
అయోధ్యలో రామాలయానికి భూమిపూజను స్వాగతించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
'దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరూ సోదరులే. భారతదేశం గొప్పది. పురాతన వారసత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని మన దేశం ఎల్లప్పుడూ పాటిస్తుంది. దానిని మన చివరి శ్వాస వరకు కాపాడుకోవాలి.'
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి