తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య'పై మరోమారు మధ్యవర్తిత్వానికి సుప్రీం ఓకే

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం కొనసాగించాలని కక్షిదారులు కోరుకుంటే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిటీ పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయవచ్చని తెలిపింది. అయితే... ఈ కేసులో రోజువారీ విచారణ మాత్రం కొనసాగుతుందని తేల్చిచెప్పింది సర్వోన్నత న్యాయస్థానం.

అయోధ్య కేసులో సుప్రీం విచారణ

By

Published : Sep 18, 2019, 12:02 PM IST

Updated : Oct 1, 2019, 1:11 AM IST

'అయోధ్య'పై మరోమారు మధ్యవర్తిత్వానికి సుప్రీం ఓకే

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై 26వ రోజు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. మధ్యవర్తిత్వం కొనసాగించాలని కక్షిదారులు కోరుకుంటే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ కమిటీ పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయవచ్చని తెలిపింది.

అయోధ్య కేసులోని కొన్ని పార్టీలు మధ్యవర్తిత్వ ప్రక్రియను పునరుద్ధరించాలని కోరుతూ తనకు లేఖ రాసినట్లు మధ్యవర్తిత్వ కమిటీ సారథి​, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కలిఫుల్లా న్యాయస్థానానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం... మధ్యవర్తిత్వం కొనసాగింపునకు అనుమతించింది. రాజీ కుదిరితే... ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

అయితే... విచారణ తుది దశకు చేరుకున్నందున అయోధ్య కేసులో రోజువారీ విచారణ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. మధ్యవర్తిత్వ కమిటీ జస్టిస్​ కలిఫుల్లా నేతృత్వంలోనే కొనసాగుతుందని, సంప్రదింపులు ఎప్పటిలాగే గోప్యంగా జరగాలని తేల్చిచెప్పింది.

కమిటీ విఫలం...!

అయోధ్య వివాదంలో రెండు వర్గాలతో చర్చించి, పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులు.
దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది. ఆగస్టు 1న నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు... ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో కమిటీ విఫలమైందని పేర్కొంది. ఆగస్టు 6న అయోధ్య కేసుపై రోజువారీ విచారణ ప్రారంభించింది.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: నాలుగేళ్ల బిడ్డను దొంగ నుంచి కాపాడుకున్న అమ్మ

Last Updated : Oct 1, 2019, 1:11 AM IST

ABOUT THE AUTHOR

...view details