కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారమయ్యే అద్భుత క్షణం ఆసన్నమైంది. రామాయణంలోని ఉత్కృష్ట ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విశ్వమందిర నిర్మాణానికి అంకురార్పణ చేసే ముహూర్తం సమీపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరగనుంది. శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
అయోధ్య సర్వం సిద్ధం...
శంకుస్థాపన మహోత్సవానికి చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భవ్య రామమందిర భూమిపూజ సందర్భంగా... అక్కడి ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీపాలతో అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి.భూమిపూజకు సంబంధించి నగరంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి మంగళవారం 'రామార్చన పూజ' చేశారు. వేదమంత్రాలతో రామ జన్మభూమి ప్రాంగణమంతా మారుమోగుతోంది.
12 గంటల 15 నిమిషాలకు...
రామమందిర శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు అయోధ్యకు చేరుకోనున్నారు. ఆ వెంటనే హనుమాన్‌గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాముడిని దర్శించుకునే ముందు ఇక్కడనున్న హనుమంతుడికి పూజలు చేయాలని ప్రజలు విశ్వసిస్తారు. ప్రధాని అక్కడే 5-7 నిమిషాల పాటు ఉంటారు.
అనంతరం అక్కడి నుంచి రామమందిర శంకుస్థాపన వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అప్పటికే భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు.
మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో క్రతువు ముగిసేలా ముహూర్తం నిర్ణయించారు. ఆ సయంలో వేద పఠనం, మంత్రోచ్ఛారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భూమి పూజ కార్యక్రమంలో ఐదు వెండి ఇటుకలను కూడా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు భూమిపూజ జరిగే అవకాశముంది.