అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు మౌల్వీ అహ్మదుల్లా షా పేరు పెట్టే అవకాశాలున్నాయి. 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తిగా భావిస్తున్న ఆయన పేరును నూతన మసీదుకు పెట్టే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నామని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్టు కార్యదర్శి అథహర్ హుస్సేన్ వెల్లడించారు.
బాబ్రీ మసీదు మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మీదుండగా.. నూతన మసీదుకు సైతం ఆ పేరే పెట్టాలనే చర్చలు జరిగాయని ట్రస్టు వెల్లడించింది. అయితే మత సోదరత్వానికి, దేశభక్తికి, ప్రతీకగా నిలిచిన 'మౌల్వీ షా' పేరు మీదుగా ఈ మసీదును నిర్మించాలని ట్రస్టు భావిస్తోంది.
అయోధ్య మసీదు ప్రాజెక్టుకు స్వాతంత్ర్య సమరయోధుడైన మౌల్వీ అహ్మదుల్లా షా పేరు పెట్టే అంశంపై ఐఐసీఎఫ్ ట్రస్టు తీవ్ర సమాలోచనలు జరుపుతోంది. దేశంలోని ఇతర సంఘాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. నిజంగా ఇది ఆహ్వానించదగిన సలహా. మరోమారు చర్చించి త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం.
-హుస్సేన్, ఐఐసీఎఫ్ ట్రస్టు కార్యదర్శి.