రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తుండటంతో అయోధ్య నగరం (ఉత్తర్‌ప్రదేశ్) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న నిర్వహించే భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునా శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. భూమిపూజను ఎన్నో విశేషాల సమాహారంగా.. ఓ చరిత్రాత్మక కార్యక్రమంగా నిలపాలన్న సంకల్పంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముహూర్తం
ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా భూమిపూజకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకుగాను నక్షత్రాల్లాంటి 5 వెండి ఇటుకలను వాడుతారు. ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంతానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ప్రాచీన హనుమాన్ దేవాలయంలో కూడా ప్రధాని పూజలు చేస్తారని మహంత్ కమల్‌నయన్ దాస్ తెలిపారు.
ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్న సిబ్బంది ఆహ్వానితులు
ఆహ్వానితుల జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించింది. ఆహ్వానితుల సంఖ్యను ట్రస్ట్ వెల్లడించలేదు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో.. దాదాపు 200 మందిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. హాజరయ్యే ప్రముఖుల్లో 50 మంది వంతున ఒక ‘బ్లాక్’గా కూర్చుంటారు. దేశంలోని ప్రముఖ సాధువులు, మహంత్‌లు.. ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అతిథులు.. రామ జన్మభూమి ఉద్యమంతో మమేకమయిన అగ్రనేతలు.. ఇలా వీరికి బ్లాక్‌లను కేటాయిస్తారు.
సుందరీకరణతో తళుకులీనుతున్న అయోధ్య నగర రహదారులు ప్రత్యక్ష వీక్షణం
కరోనా నేపథ్యంలో భూమిపూజ కార్యక్రమానికి ప్రజలు నేరుగా రావడానికి వీలుపడని నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య, ఫైజాబాద్‌లలో ఎల్‌ఈడీ తెరలను పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు ఈ జంట నగరాల్లో లౌడ్ స్పీకర్లను కూడా ఏర్పాటు చేస్తారు.
కళాత్మకం
ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు హనుమాన్‌గఢీ మందిర్ ఎదుట ఏర్పాటు చేస్తున్న స్వాగత ద్వారం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఆయన అయోధ్యకు చేరుకునే రహదారిని చుక్కల రూపంలో సుందర కళాకృతులతో తీర్చిదిద్దుతున్నారు. అయోధ్య, ఫైజాబాద్‌లోని ప్రధాన మార్గాలన్నింటినీ వర్ణచిత్రాలతో శోభాయమానం చేస్తున్నారు. జాతీయ రహదారి వద్ద ఉన్న పైవంతెన స్తంభాలను కళాత్మకంగా తీర్చిదిద్దారు. అన్ని ఆలయాల ప్రవేశద్వారాల వద్ద సుందరంగా అలంకరిస్తున్నారు.
దేదీప్యమానం
భూమిపూజను మరో దీపావళి పండగలా చేయాలని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాధువులనుద్దేశించి అన్నారు. ఈ నేపథ్యంలో భారీఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఒకరోజు ముందు నుంచే.. అంటే ఆగస్టు 4, 5 తేదీల్లో అయోధ్యలోని అన్ని ఆలయాలు, మఠాలను దేదీప్యమానం చేయనున్నారు. ట్రస్ట్ సభ్యులు, ఆయోధ్యలోని సాధువులంతా ఆ నగరంలోని హనుమాన్‌గఢీ, దశరథ్‌మహల్, కనక భవన్, సీతా రసోయి ఆలయాలు సహా అన్ని ప్రధాన దేవాలయాలు, మఠాల్లో దీపాలు వెలిగిస్తారు. భూమిపూజకు రెండు రోజుల ముందు నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రామాయణ పారాయణం నిర్వహిస్తారు. భూమిపూజ సందర్భంగా అయోధ్య నగరమంతటా 3 రోజుల పండగ జరుగుతుందని శ్రీరామ జన్మభూమి న్యాస్ సీనియర్ సభ్యుడు కమల్‌నయన్ దాస్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలోనే ఈ పండగ జరుపుకోవాలని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కోరారు.
ఇదీ చదవండి:ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు