తమ పార్టీ కీలక హామీల్లో ఒకటైన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమవుతోందని భాజపా నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పార్టీ సాధించిన సైద్ధాంతిక విజయంగా నేతలు అభివర్ణిస్తున్నారు. గతంలో భాజపా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైనా.. భాగస్వామ్య పార్టీలను మచ్చిక చేసుకునేందుకు రామ మందిర నిర్మాణాన్ని ఆ పార్టీ పక్కనపెట్టింది. ఇప్పుడు అదే మందిర నిర్మాణాన్ని చేపడుతుండగా అనేక మంది విపక్ష నేతలు కూడా ప్రశంసిస్తున్నారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. హిందూత్వ విశ్వాసాలను ఈ మందిర నిర్మాణం ఇంకా ఏకీకృతం చేస్తుందని భావిస్తున్నారు.
నేటితో ఏడాది పూర్తి..
అలాగే భాజపా కీలక హామీల్లో ఒకటైన జమ్ముకశ్మీర్లో 'ఆర్టికల్-370 రద్దు' అయి సరిగ్గా ఏడాది కావడం గమనార్హం. 'మాకు సంబంధించి మందిర నిర్మాణం ఒక విశ్వాసం. అది రాజకీయ అంశమనేది ఎప్పుడో ముగిసిన అంకం. ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ మేం రామ మందిర నిర్మాణం, ఆర్టికల్-370 రద్దుని గురించి ప్రముఖంగా ప్రస్తావించాం. ఆ రెండు ఆ హామీలు ఇప్పుడు నెరవేరాయి.' అని ఓ భాజపా నేత చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ తదితరులు మందిర నిర్మాణాన్ని ఆహ్వానిస్తుండగా.. 'నైతికంగా దివాళాతీసిన లౌకికవాదులు ఇప్పుడు అకస్మాత్తుగా రాముని పట్ల వారికి ఉన్న భక్తిని గుర్తిస్తున్నారు. అయితే కేవలం భాజపాకి మాత్రమే మందిర నిర్మాణం అనేది ఒక విశ్వాసంతో కూడిన నిబంధన' అని ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ చెప్పారు.