సంచలనాత్మక ‘అయోధ్య’ కేసు వాదనల్లో తెలుగు న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించారు. ‘రాంలల్లా విరాజ్‌మాన్’, హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు కె. పరాశరన్, సీఎస్ వైద్యనాధన్, పీఎస్ నరసింహ, రంజిత్‌కుమార్‌లు వాదనలు వినిపించిన విషయం విదితమే. వీరికి సహకారం అందించిన పలువురు జూనియర్లలో తెలుగువారిది కీలక పాత్ర. కేసుకు సంబంధించి హిందూ సంస్థలు, వ్యక్తుల తరఫు న్యాయవాదులంతా 2017 నవంబరులో ఓ బృందంగా ఏర్పడ్డారు. తితిదే అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ శ్రీధర్ పోతరాజు, ‘అఖిల భారతీయ అధివక్త పరిషత్’ బృందాలు కీలక సమాచారాన్ని సేకరించి అందించడంలో సహకరించాయి. దివ్వెల భరత్‌కుమార్, వాడ్రేవు పట్టాభిరామ్, తాడిమళ్ల భాస్కర గౌతమ్, గవర్రాజు ఉషశ్రీ, వీఎన్‌ఎల్ సింధూరలు విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. కీలక సమాచారాన్ని సేకరించి అందించారు.
అయోధ్య కేసు వాదనల్లో పాలుపంచుకున్న తెలుగు న్యాయవాదులు రోజుకు 20 వేల పేజీలు డిజిటలైజేషన్
న్యాయవాది శ్రీధర్ పోతరాజు మాట్లాడుతూ...‘‘అక్టోబరు నుంచి ‘అయోధ్య’ కేసులో రోజువారీ విచారణ మొదలవడంతో పనిభారం, వేగం పెరిగింది. పాత కేసుల్లో తీర్పులు, ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, భారత పురావస్తు శాఖ నివేదిక, పటాలు ఇలా ప్రతి అంశాన్నీ విశ్లేషించి సుమారు 20 వేలకు పైగా ప్రతులను డిజిటలైజేషన్ చేశాం. సీనియర్లకు అవసరమైన అంశాలపై తగిన వివరాలను అప్పటికప్పుడు అందించడానికి ఈ యత్నం ఎంతో తోడ్పడింది. మా కృషికి చక్కటి ఫలితం దక్కింది’’ అని చెప్పారు. సీనియర్ న్యాయవాదుల మధ్య ‘అఖిల భారతీయ అధివక్త పరిషద్’ జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది అయిన దివ్వెల భరత్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. 1850 నుంచి 1925 వరకు వచ్చిన సంబంధిత కేసుల తీర్పులను సంకలనం చేసే బాధ్యతను తాడిమళ్ల భాస్కర గౌతమ్ నిర్వహించారు. సీనియర్ న్యాయవాదుల వాదనలకు సంబంధించిన ముసాయిదా రూపకల్పన బాధ్యత అంతా న్యాయవాది వాడ్రేవు పట్టాభిరామ్ చూసుకున్నారు.
పీఎస్ నరసింహ
సుప్రీంకోర్టులోని సీనియర్ తెలుగు న్యాయవాదుల్లో ఈయన ఒకరు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. బీసీసీఐ వివాదం సమయంలో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో ఈయన సభ్యులుగా పనిచేశారు.