సుప్రీంకోర్టు చరిత్రలో అయోధ్య భూవివాద కేసు సరికొత్త రికార్డు నెలకొల్పింది. సర్వోన్నత న్యాయస్థానంలో అత్యంత సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండో కేసుగా 2.77 ఎకరాల అయోధ్య భూవివాదం నిలిచింది. 1972లో 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ కేసుపై అప్పట్లో 68 రోజుల పాటు విచారణ సాగించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాతి స్థానంలో 38 రోజులతో ఆధార్ కేసు ఉండేది. అయితే 40 రోజులతో అయోధ్య భూ వివాదం కేసు.. ఆధార్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది.
ఆధార్ రికార్డ్ బ్రేక్ చేసిన అయోధ్య కేసు
అయోధ్య కేసు... రాజకీయంగా, సామాజికంగా ఎంతో సున్నితమైన అంశం. ఈ వివాదం సుప్రీంకోర్టు చరిత్రలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. సర్వోన్నత న్యాయస్థానంలో అత్యంత సుదీర్ఘకాలం విచారణ జరిగిన కేసుల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది.
దశాబ్దాల కాలం నాటి ఈ కేసుకు పరిష్కారం చూపేందుకు మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైనందున.. ఈ ఏడాది ఆగస్టు 6న సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నిర్విరామంగా 40 రోజులపాటు విచారణ చేపట్టింది. అక్టోబర్ 16న వాదనలు ముగించింది.
అనంతరం.. 2019 నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదేనని స్పష్టం చేసిన కోర్టు... మసీదు నిర్మాణం కోసం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంఅయోధ్యలోఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ధర్మాసనం ఆదేశించింది.