చలి తీవ్రత పెరుగుతున్న వేళ మద్యపానానికి దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉందని, అందువల్ల ఇంట్లో లేదా కొత్త సంవత్సర వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండటమే మేలు అని తెలిపారు.
పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌లలో డిసెంబర్ 28 నుంచి తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఫ్లూ, ముక్కుకారడం వంటి ఆరోగ్య ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యపానం శరీర ఉష్ణోగ్రతలను మరింతగా తగ్గించి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఈ చలి తీవ్రతకు శరీరం పాడవ్వకుండా మాయిశ్చరైజర్లు వాడాలని సూచించారు.