కర్ణాటక కోలార్ జిల్లా కాసంబల్లిలోని రోడ్లపై నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి.. వీకే పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన రహదారిని కలుపుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అధ్వానంగా తయారైన రోడ్లను బాగుచేయాలని గ్రామస్థులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి అనే ఆటోడ్రైవర్.. అధికారులకు ఫిర్యాదు చేశాడు. గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫలితంగా అధికారుల తీరుపై విసుగు చెందిన శ్రీనివాస్.. ఈ సమస్యను తానే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు.
రహదారిపై ఆటోడ్రైవర్ నిశబ్ద పోరాటం - auto driver from karnataka kolar district
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఆలోచించకుండా ఓ వ్యక్తి నలుగురికి ఉపయోగకరమైన పని చేసేందుకు నడుం బిగించారు. అధికారుల తీరుతో విసుగు చెంది గుంతలు పడిన రోడ్డును స్వయంగా బాగు చేస్తున్నాడు. పేరుకు ఆటో డ్రైవర్ అయినా సేవా గుణంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఎవరి సాయం లేకుండా రహదారిని కొంచెం కొంచెం బాగు చేయటం మొదలు పెట్టాడు. తన పని చేసుకుంటునే.. రోజుకు రెండు గంటలు మాత్రం గుంతలు పూడ్చేందుకు శ్రమిస్తున్నాడు. వచ్చే దారిలో కంకర, ఇసుక సేకరించి గుంతలు ఉన్న చోట పోసి రోడ్డును బాగు చేస్తున్నాడు. కాసంబల్లిలోనే కాదు కోలార్ జిల్లా వ్యాప్తంగా ఇలా గుంతలు పడిన రోడ్లే ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం చెందుతున్న గ్రామస్థులు.. శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.