రాజస్థాన్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది కాంగ్రెస్. ఎమ్మెల్యేలను ప్రలోభపరిచి రాజకీయ అనిశ్చితికి తెరలేపాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ మహేశ్ జోషి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపరిచేందుకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు చొప్పున భాజపా ఎరవేస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది సమయానికే మహేశ్ జోషి ఈ మేరకు ఫిర్యాదు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
" ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యులను ప్రలోభ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఖండించాల్సిన చర్య. ఇలాంటివాటికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."