మహారాష్ట్రలో నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై దాడి చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు ముంబయి పోలీసులు. ఆయనపై శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయింది.
అరెస్టయిన వారిలో శివసేన కార్యకర్త కమలేశ్ కదం ఉన్నారు. వీరిని సమతా నగర్ ఠాణాకు తరలించగా.. కాసేపటికే బెయిల్ మంజూరైంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కార్టూన్‌ను వాట్సాప్‌లో మదన్ షేర్ చేయగా వివాదం రాజుకుంది. లోఖండ్వాలాలో మదన్‌పై శుక్రవారం ఉదయం కొంతమంది శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఆయన కళ్లకు తీవ్ర గాయమైందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు.
'ఇలాంటి ప్రభుత్వమా?'
తనపై శివసేన కార్యకర్తలే దాడి చేసినట్లు మదన్ ఆరోపించారు.
"నేను వాట్సాప్‌లో కార్టూన్ పంపాక.. కొంతమంది నాకు బెదిరింపు కాల్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన 8- 10 మంది వ్యక్తులు నన్ను కొట్టారు. నేను నా జీవితమంతా దేశం కోసం పనిచేశా. ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు.
మన దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. వాట్సాప్.. ఇతరులతో అనుసంధానమయ్యేందుకు సమాచారాన్ని పంచుకోనేందుకు ఒక మాధ్యమం. సందేశాలు ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించాల్సింది ప్రభుత్వం."
- మదన్ శర్మ, నేవీ మాజీ అధికారి
ఫడణవీస్ స్పందన..
ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫఢణవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఠాక్రేను డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:నేర రాజకీయాల విశ్వరూపం!