పెట్రోల్ ఏటీఎం తయారు చేసిన గిరిజన యువకుడు మన దగ్గర ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డు తీసుకెళ్లి, ఏటీఎంలో పెట్టి.. నగదును ఉపసంహరించకుంటాం. ఇదే తరహాలో నగదుకు బదులు పెట్రోల్ వచ్చే యంత్రం గురించి తెలుసా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అలాంటి ఓ ఏటీఎంను రూపొందించాడు ఒడిశా కియోంజార్ జిల్లా హరిచంద్రన్‌పూర్ మండలం బ్రాహ్మణిపాల్‌కు చెందిన గిరిజన యువకుడు జితేంద్ర హేంబ్రమ్.
బ్రాహ్మణిపాల్ గ్రామంలో పెట్రోల్ బంక్ లేదు. పెట్రోల్ కోసం జాబ్‌పుర్ జిల్లా దుబురి వద్ద ఉన్న బంక్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రి సమయంలో అక్కడికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఈ సమస్యలు గమనించిన జితేంద్రకు.. పెట్రోల్ ఏటీఏం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. చదివింది పదో తరగతే అయినా... ఏటీఎంకు అవసరమైన సాంకేతికత గురించి కష్టపడి తెలుసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి యంత్రానికి కావాల్సిన విడి భాగాలను సంపాదించాడు. ఆరు నుంచి ఏడు నెలల పాటు శ్రమించి ఏటీఎం తయారు చేశాడు.
డిజిటల్ చెల్లింపులు కూడా..
ఈ పెట్రోల్ ఏటీఎం వద్ద సాధారణ బంక్ దగ్గర ఉన్నట్లు ప్రత్యేకించి ఓ వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. వినియోగదారుడు వచ్చి ఏటీఎంలో నగదును ఉంచాలి. మనం అందించిన నగదుకు సరిపడా పెట్రోల్ వస్తుంది. 24 గంటల పాటు దీని ద్వారా పెట్రోల్ పొందవచ్చు.
మొదట ఈ యంత్రం నుంచి నగదు ద్వారానే పెట్రోల్ తీసుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్నీ కల్పించాడు జితేంద్ర. అయితే... ఒకే దఫాలో రూ.50 లేదా రూ.100కు సరిపడా మాత్రమే పెట్రోల్ పొందవచ్చు.
పెట్రోల్ ఏటీఎం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రాత్రి వేళ కూడా పెట్రోల్ పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జితేంద్రను మెచ్చుకుంటున్నారు.
ఉన్నత విద్యను అభ్యసించకపోయినా... సమాజానికి తన వంతు సాయం చేయాలనే సంకల్పంతో ఈ పెట్రోల్ ఏటీఎం తయారు చేసినట్లు తెలిపాడు జితేంద్ర. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరో రెండు, మూడు ప్రాజెక్టలకు రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించాడు జితేంద్ర.