భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రాంత వాసులకు వరప్రదాయినిగా నిలవనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వైద్య, వ్యాపార కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 9.02 కి.మీ ఉన్న ఈ సొరంగ మార్గం వ్యూహాత్మకంగానూ భారత్‌కు కీలకం కానున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
"ఈ సొరంగ మార్గం నిర్మాణంతో వాజ్‌పేయీ కలను నిజం చేశాం. ప్రపంచంలోనే ఇది అతి పొడవైన హైవే టన్నెల్. దేశానికి రక్షణపరంగానూ చాలా వ్యూహాత్మకమైనది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా నిర్మించాం. మనాలీ- లేహ్ మధ్య ప్రయాణ సమయం 4-5 గంటలు తగ్గుతుంది. ఈ టన్నెల్‌తో పర్యటక రంగానికి నూతనోత్తేజం రానుంది. కొత్తగా ఉద్యోగాలు ఏర్పడతాయి."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
దశాబ్దాల నాటి కల సాకారమాయే..
హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ సొరంగం.. 'వ్యూహాత్మకంగా ప్రధానమైంద'ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. సరిహద్దులో మౌలిక వసతుల కల్పనకు ఈ ప్రాజెక్టు.. బలం చేకూరుస్తుందని ట్విట్టర్ వేదికగా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య ఒక ప్రత్యేక అనుబంధానికి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.