తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ప్రమాదంలో 43 మంది మృతి.. భవన యజమాని అరెస్టు - At least 43 people were killed in a fire in Anazmandi, Delhi.

దిల్లీలోని అనాజ్‌మండీలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృత్యువాతపడ్డారు. నాలుగంతస్థుల ఇరుకైన భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో.. అనేక మంది గాయపడ్డారు. 63 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది..కార్బన్‌ మోనాక్సైడ్‌ కారణంగా ఊపిరి ఆడకే ఎక్కువమంది చనిపోయినట్లు స్పష్టంచేశారు. మృతులంతా బ్యాగుల తయారీపరిశ్రమలో  కూలీలే కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

at-least-43-people-were-killed-in-a-fire-in-anazmandi-delhi
దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: 43 మంది మృతి

By

Published : Dec 8, 2019, 9:08 PM IST

దిల్లీ రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలోని నాలుగు అంతస్థుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో అనేక మంది కూలీల బతుకులు బుగ్గి పాలయ్యాయి. భవనంలో బ్యాగుల తయారీ పరిశ్రమలో కార్మికులు నిద్రలో ఉండగా ఉదయం 5 గంటల సమయంలో షార్ట్‌ సర్య్యూట్ జరిగింది. దీంతో అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు మంటల్లో కాలి బూడిద కాగా.... ఎక్కువ మంది కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువుల వల్ల ఊపిరి ఆడక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 150 మంది అగ్నిమాపక సిబ్బంది 35 శకటాలతో రంగంలోకి దిగి 63 మందిని రక్షించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు.

సహాయక చర్యలకు ఇబ్బంది

ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకుగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తింది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు చేరుకోవడం కష్టమైంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది భుజాలపై మోసుకుని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. క్షతగాత్రులను రాంమనోహర్ లోహియా, హిందూరావు ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భవన యజమాని అరెస్ట్​

...

అగ్నిప్రమాదం జరిగిన భవనం యాజమాని రెహన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవనానికి ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లేవని... అధికారులు తెలిపారు.

కేజ్రీవాల్​ పరామర్శ

దిల్లీ సీఎం కేజ్రీవాల్.. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై మెజిస్ట్రియల్‌ విచారణకు ఆదేశించినట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షలు, క్షతగాత్రులకు లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియాను దిల్లీ సర్కారు ప్రకటించింది.

కేంద్ర సహాయం

మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు..తీవ్రంగా గాయపడిన వారికి 50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు... కేంద్రం తెలిపింది. భాజపా మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షలు పరిహారం ప్రకటించింది.

ప్రముఖుల సంతాపం

అనాజ్ మండి ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు.

రెండో అతిపెద్ద ఘటన

1997లో దిల్లీలోని ఉపహార్‌ సినిమా థియేటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో..... 59 మంది మృతి చెందగా....ఆ తర్వాత దేశ రాజధానిలో చోటు చేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : దిల్లీ ఫైర్​: 11 మందిని కాపాడిన 'ఒక్క మగాడు'

ABOUT THE AUTHOR

...view details