కొవిడ్-19 సంక్షోభం తర్వాత చిన్నారుల విద్యాభ్యాసంపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుందని సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది విద్యార్థుల అభ్యాసాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని తన నివేదిక సేవ్ అవర్ ఎడ్యుకేషన్లో వెల్లడించింది. మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇది 91 శాతమని స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా విద్యావ్యవస్థకు దూరంగా ఉన్న విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తరగతులకు రాలేరని అధ్యయనం తెలిపింది.
ఈ అంశంపై సేవ్ ద చిల్ట్రన్ ఇండియా విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ కమల్ గౌర్ ఈటీవీ భారత్తో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో భారత్లో విద్యార్థుల పరిస్థితిని వివరించారు.
భారత్తో పాటు ప్రపంచ విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రీ-ప్రైమరీ నుంచి తృతీయ స్థాయి వరకు 32.2 కోట్ల మంది విద్యార్థుల అభ్యాసం కరోనా మహమ్మారి వల్ల దెబ్బతింటుందని యునెస్కో చెబుతోంది. వీరు ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యనభ్యసించే అవకాశం ఉంది. కానీ అందులో ఎంత మంది నిజంగా నేర్చుకుంటున్నారనేది తెలియదు.
ఒకవేళ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్తే వారు నేర్చుకోవడం కష్టం. 'వార్షిక విద్యా స్థితి నివేదిక'(ఏఎస్ఈఆర్) సహా భారత ప్రభుత్వం విడుదల చేసే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.
కరోనాకు ముందే పిల్లల అభ్యాసం సరిగా జరగలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థ దెబ్బతింది. భారత్లో 32.2 కోట్ల మంది చిన్నారుల అభ్యాసం సంక్షోభంలో ఉంది. ఇక పాఠశాలల్లోకి ప్రవేశించని విద్యార్థులపై ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోండి. వలస కార్మికుల పిల్లల పరిస్థితి, బాలికల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.
ఈ 20 శాతం డ్రాప్ అవుట్ రేటు భారతదేశానిదా లేదా ప్రపంచం మొత్తానికి వర్తిస్తుందా?
సాధారణంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత పాఠశాలల నుంచి పిల్లలు వైదొలిగే సగటు డ్రాప్ అవుట్ రేటు ఇది. ప్రస్తుతానికైతే ఎలాంటి అంచనాలు లేవు. పాఠశాలలు, అంగన్వాడీలు పునఃప్రారంభం కాలేదు కాబట్టి ఎంత మంది చిన్నారులపై ప్రభావం పడుతుందనే పరిశోధనలు జరగడం లేదు.
వీధి బాలలంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆకస్మికంగా అందరూ అదృశ్యమయ్యారు. వారి విద్యాభ్యాసం పరిస్థితి ఏంటో తెలియదు.
పట్టణాల్లోని చాలా వరకు మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఆన్లైన్ విద్యకు మారారు. ఈ విధానం పనిచేస్తోందా?
పిల్లలు ఇదివరకు దూర మాధ్యమం ద్వారా నేర్చుకోలేదు. ఈ విధానం గురించి ఇప్పుడే తెలుసుకొని సర్దుబాటు అవుతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఆన్లైన్లో విద్యా బోధన చేయడానికి సిద్ధపడలేదు.
ఈ విధానం ద్వారా పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. సాధారణంగా విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. కానీ చుట్టూ స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకుండా చిన్న గదికి పరిమితం అయిపోయినప్పుడు విద్యాభ్యాసం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. సందేహాలను నేరుగా అడగలేరు.
ఈ నాలుగు నెలలు వృథా అయినట్లేనా? మీ అంచనాలేంటి?
ఈ విషయంలో ఎలాంటి మదింపు చేయలేదు కాబట్టి అసలు విద్యాభ్యాసం జరగట్లేదని చెప్పడం చాలా కష్టం. కానీ కచ్చితంగా అంతరాయం ఏర్పడింది.