మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. ఈ సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చివరిరోజైన ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పక్షాలు భారీ ప్రణాళికలు రచించుకున్నాయి. మహారాష్ట్ర, హరియాణాల్లో మరోసారి అధికారం నిలుపుకోవాలని భాజపా... ఈసారైనా జయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.
'అసెంబ్లీ పోరు': నేటితో ప్రచారానికి తెర.. 21న ఎన్నికలు - శివసేన-భాజపా
హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మొదలైన రాజకీయ వేడి ప్రధాన పార్టీల అధినేతలు, ముఖ్య నాయకుల ప్రచారంతో మరింత వేడెక్కిపోయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుండగా.. చివరి క్షణం వరకూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
!['అసెంబ్లీ పోరు': నేటితో ప్రచారానికి తెర.. 21న ఎన్నికలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4797462-thumbnail-3x2-poll.jpg)
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. మహారాష్ట్రలో భాజపా, శివసేన కూటమి తరపున మోదీ, అమిత్ షా సహా ఇతర కీలక నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరఫున రాహుల్ గాంధీ, శరద్ పవార్లు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.
భాజపా తరపున ప్రచారం చేసిన ప్రధాని మోదీ, అమిత్ షా కాంగ్రెస్సే లక్ష్యంగా ఆరోపణలు చేశారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కాంగ్రెస్ అర్థం చేసుకోవటం లేదని విమర్శలు గుప్పించారు. మరోవైపు మోదీనే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.