తెలంగాణ

telangana

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీలకు గుణపాఠాలు!

By

Published : Oct 26, 2019, 12:39 PM IST

మే నెలనాటి సార్వత్రిక మహా సమరం యావత్‌ విపక్ష శిబిరాన్ని కకావికలం చేసిన దరిమిలా అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన మహారాష్ట్ర, హరియాణాల అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తర ఫలితాల్ని ఆవిష్కరించింది. 2014లో మాదిరిగానే మోదీ ప్రభంజనం రెండు చోట్లా కమలం పార్టీ సర్కార్లను ఇనుమడించిన మెజారిటీతో పునః ప్రతిష్ఠించడం ఖాయమన్న అంచనాలకు తగ్గట్లే నాడీ జోస్యాలూ వెలువడ్డాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీలకు గుణపాఠాలు!

మహారాష్ట్ర, హరియాణాల్లోని మొత్తం 378 అసెంబ్లీ స్థానాలతో పాటే, 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ నియోజక వర్గాలకూ జరిగిన ఉప ఎన్నికలు మినీ సార్వత్రిక సమరంగా సాగాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ (11), గుజరాత్‌ (6)లాంటి కమలం పార్టీ కంచుకోటల్లో మిశ్రమ ఫలితాలు ప్రతిపక్షాలకు కొత్త ఊపిరులూదగా- తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లలో అధికార పార్టీలు విజయ దరహాసాలు చిందించాయి.

క్రితంసారి ఎన్నికల్లో అంతకు ముందెన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో 27.8శాతం ఓట్లు 122 సీట్లు సాధించిన భాజపా, నేడు తనంతట తానే కనీస మెజారిటీ 145 సీట్ల మార్కును అధిగమిస్తుందని, శివసేనతో కలిసి అధికార కూటమి బలం అలవోకగా రెండొందలు దాటిపోనుందని అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. అదే హరియాణాలో- మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను భాజపా 70కిపైగా సీట్లు గెలుచుకోనుందని పలు సర్వేలు ఎలుగెత్తాయి. గతంలో కంటే పోలింగ్‌ శాతం తగ్గడం‘ప్రభుత్వ వ్యతిరేకత’ ఏదీ లేదనడానికి నిదర్శనమని కమలనాథులు నిశ్చింతగా ఉన్నా- తుది ఫలితాలు ఆందోళనకర దృశ్యాన్నే కళ్లకుకట్టాయి.

సత్తాచాటిన పవార్​ పార్టీ...

మహారాష్ట్రలో పాలక కూటమి పునరధికారానికి బాటలు పడ్డా, భాజపా-శివసేనల సీట్లకు భారీగా కోతపడింది. గతంలో కంటే ఏకంగా 12సీట్లు పెంచుకొని పవార్‌ పార్టీ సత్తా చాటితే, కాంగ్రెస్‌ స్కోరు సైతం ఇనుమడించింది. హరియాణాలో అయితే త్రిశంకు సభ ఆవిష్కారం, నిరుడు పురుడు పోసుకొన్న జన్‌ నాయక్‌ జనతాపార్టీ పది స్థానాలు గెలిచి తులాభారంలో తులసిదళంలా మారడం- జాతీయ పక్షాలకు మింగుడుపడనిది.

రెండు పుష్కరాలుగా ఏ ఒక్క పార్టీకీ విస్పష్ట మెజారిటీ దక్కని రణక్షేత్రంగా మహారాష్ట్ర వాసికెక్కింది. సైద్ధాంతిక సారూప్య పక్షంగా శివసేనతో కలిసి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా అక్కడి 48 లోక్‌సభ సీట్లలో 41 చోట్ల జయకేతనం ఎగరేసింది. పిమ్మట అయిదు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే కూటమిగా పోటీ చేస్తే- భాజపా 132, శివసేన 100, తక్కిన మిత్రపక్షాలు 12 కలిపి అసెంబ్లీలో 244 సీట్లను కొల్లగొట్టగలిగేవి. కానీ, పెద్దన్న పోకడలతో పొత్తును శివసేన కాలదన్నడంతో మరోవంక ఎన్‌సీపీ, కాంగ్రెసులూ వేటికవిగా పోటీపడటంతో, నాడు నాలుగు స్తంభాలాట అనివార్యమైంది.

మిత్రభేదం మొదటికే మోసమన్న తెలివిడితో భాజపా- శివసేన, కాంగ్రెస్‌-ఎన్‌సీపీ జట్టుకట్టి పోటీపడ్డ తాజా ఎన్నికల్లో- ప్రచార పర్వం మొదలు కాకముందే విపక్ష శిబిరం వరస ఫిరాయింపులతో కుదేలైపోయింది. పైయెత్తున స్ఫూర్తిమంతమైన నేతృత్వం లేక, రాష్ట్ర స్థాయిలో అసమ్మతి కుంపట్లు చల్లారక హస్తం పార్టీ బిక్కమొగమేస్తే, ఈడీ కేసులకు వెరచేది లేదంటూ మరాఠా యోధుడు పవార్‌ సాగించింది అక్షరాలా ఒంటరి పోరాటమే.

సవాల్​ విసిరిన రెబల్స్​.....

370 అధికరణ రద్దు, ముమ్మారు తలాక్‌ నిషేధ చట్టం వంటి వాటిని ప్రస్తావిస్తూ భాజపా మహారథులు రాష్ట్రాన్ని చుట్టేసినా, ఆర్థిక మాంద్యం తాలూకు దుష్ఫలితాలు పొడగడుతున్న దశలో జరిగిన ఎన్నికల ప్రాధాన్యం ఎనలేనిదే! ఫిరాయింపుల వ్యూహంతో ప్రత్యర్థుల్ని చిత్తు చేశామనుకొన్న భాజపా-శివసేనలకు దాదాపు 75మంది తిరుగుబాటుదారుల నుంచి ఎదురైన సవాలు సామాన్యమైనది కాదు. అంతకుమించి గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలో గూడుకట్టిన అసమ్మతి సెగ రెండు రాష్ట్రాల్లోనూ పాలక పక్షాల పుట్టిముంచిందనడంలో సందేహం లేదు!

భారతావని జనాభాలో 11 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర, హరియాణాలు స్థూల దేశీయోత్పత్తిలో 18శాతం సమకూరుస్తున్నాయి. ప్రగతి సూచీల్లో జాతీయ సగటుకంటే మిన్నగా రాణిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ తాజా ఫలితాలు కమల నాథులకు మింగుడుపడనివి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పది స్థానాలకుగాను ఎనిమిదిని ఒడిసిపట్టిన భాజపా ఆ తరవాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకున్న నాలుగు సీట్లను పన్నెండు రెట్లదాకా పెంచుకొని 47 సీట్లు సాధించింది.

మిషన్​ 75 ప్లస్​ అనుకుంటే మెజార్టీకి దూరం....

ఈసారి ‘మిషన్‌ 75 ప్లస్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కమలం పార్టీ స్కంధావారాలు అవిశ్రాంతంగా పరిశ్రమించినా, కనీస మెజారిటీ 46 సీట్లకు గణనీయ దూరంలోనే భాజపా ఆగిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పదిసీట్లను గంపగుత్తగా భాజపా ఖాతాలో వేసిన ఓటర్లు ఇప్పుడిలా త్రిశంకు సభను కొలువు తీర్చడమే విస్తుగొలుపుతోంది.

కుల రాజకీయ సమీకరణలను పునర్‌ నిర్వచిస్తూ దూసుకెళుతున్న కమలం పార్టీ పట్ల రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగంగా ఉన్న జాట్లు, దళితులు, ముస్లిముల అసంతృప్తి తాజా ఫలితాల్లో ప్రస్ఫుటమవుతోంది. జాతీయ- రాష్ట్ర ప్రాథమ్యాలకు అనుగుణంగా ఓటేసే పౌరుల పరిణతి సైతం ఈ ఫలితాల సరళికి కారణమైందని పార్టీలు సానుకూల దృక్పథంతో గ్రహిస్తే- ఎన్నికల వ్యూహాల్లో గుణాత్మక పరివర్తన వచ్చే అవకాశం ఉంది. సుస్థిర పాలక పక్షం, బలమైన ప్రతిపక్షం- ఈ రెండూ ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి రెండు కళ్లు. రెండు రాష్ట్రాల్లోనూ ‘ఇతరుల’ సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం పేరుగొప్ప పార్టీల సంస్థాగత బలహీనతల్నే ఎండగడుతోందని చెప్పక తప్పదు. జాగ్రత్తగా నేర్వాలేగాని, అన్ని పార్టీలకూ ఎన్నో గుణపాఠాల్ని బోధించిన నిశ్శబ్ద ప్రజాస్వామ్య విప్లవమిది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details