ఖండాంతరాలు దాటి విస్తరించిన కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఎవరి నుంచి వైరస్ వ్యాపిస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసోంకు చెందిన ఓ రైతు మాత్రం తనకు కరోనా సోకదని నొక్కి వక్కాణిస్తున్నాడు.
మందు లేని ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న ఆయుధం భౌతిక దూరం. ప్రపంచమంతా ఇదే పాటిస్తోంది. కానీ భూటాన్ సరిహద్దులోని బాక్సా జిల్లాలో విజయ్ బ్రహ్మ అనే రైతు.. 12 ఏళ్లుగా భౌతికంగానే కాదు, సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ.. తన పొలంలోని ఓ చెట్టుపైనే నివసిస్తున్నాడు.
12ఏళ్లుగా..
12ఏళ్ల క్రితం భార్యతో విడిపోయిన తర్వాత.. బ్రహ్మ ఏకాంత జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. అనంతరం తన పొలంలోని ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాడు. అప్పటినుంచి విజయ్ ఎవరితో కలవడు. మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు.