తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీ తిరస్కరణకు 'భాజపా' వినతి - ఎన్​ఆర్​సీ తుది జాబితాలో లోపాలు

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతామని కేంద్ర హోం మంత్రి ప్రకటించిన రోజే.. అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోంలోని నవీకరించిన జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ)ను తిరస్కరించాల్సిందిగా కేంద్రాన్ని అభ్యర్థించింది. తుది జాబితాలో చాలా లోపాలున్నాయని వ్యాఖ్యానించారు అసోం ఆర్థిక మంత్రి, భాజపా నేత హిమంత విశ్వ శర్మ.

'అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితాను తిరస్కరించండి'

By

Published : Nov 20, 2019, 7:32 PM IST

Updated : Nov 20, 2019, 8:35 PM IST

అసోం ఎన్​ఆర్​సీ తిరస్కరణకు 'భాజపా' వినతి

ఆగస్టు 31న విడుదలైన అసోం జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ)ను తిరస్కరించాల్సిందిగా కేంద్రాన్ని అభ్యర్థించింది అసోం ప్రభుత్వం. తుది జాబితాలో చాలా లోపాలున్నాయని.. ఎన్​ఆర్​సీ కూర్పు సమయంలో రాష్ట్ర సమన్వయ కర్త ప్రతీక్​ హజేలా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు అసోం ఆర్థిక మంత్రి, భాజపా నేత హిమంత విశ్వ శర్మ. ఎన్​ఆర్​సీని సవరించే అవకాశం లేనందున... తుది జాబితాను తిరస్కరించాలని కోరారు.

''అసోం ప్రభుత్వం ఎన్​ఆర్​సీని ఆమోదించలేదు. జాబితాలో అనర్హులను చేర్చారు. నిజమైన భారతీయులకు చోటు దక్కలేదు. అందువల్ల.. ఈ ఎన్​ఆర్​సీ తుది జాబితాను కేంద్ర హోం మంత్రి తిరస్కరించాల్సిందిగా.. అసోం ప్రభుత్వం, భాజపా తరఫున అభ్యర్థిస్తున్నాం. దీనిని సవరించేందుకు ఏ మాత్రం అవకాశాల్లేవు.''

- హిమంత విశ్వ శర్మ, అసోం మంత్రి

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రాతపూర్వకంగా ఎలాంటి వినతి చేయలేదని స్పష్టం చేశారు శర్మ.

జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆర్​సీ)ను దేశవ్యాప్తంగా చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా రాజ్యసభలో పునరుద్ఘాటించిన రోజే అసోం ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు షా ప్రకటనను హిమంత శర్మ స్వాగతించడం గమనార్హం.

ఎన్​ఆర్​సీ తుదిజాబితా ఆగస్టు 31న విడుదలైంది. ఈ జాబితాలో 3.11కోట్ల మందికి చోటు దక్కగా.. 19.06లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. అయితే, జాబితాలో లేక పోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని కేంద్రం హామీ ఇచ్చింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: వివక్షకు తావులేకుండా దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ: షా

Last Updated : Nov 20, 2019, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details