అసోంను వరదలు వదలటం లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 2,525 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 89 మంది మరణించారు. 1,15,515 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది.
కాజీరంగా జాతీయ ఉద్యానవనం నీట మునిగిన కారణంగా 120 మూగజీవాలు మృతి చెందాయి. మరో 147 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మరి కొన్ని జంతువులు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, ఇళ్లు దెబ్బతిన్నాయి.
వరదల నేపథ్యంలో రంగంలోకి దిగిన అసోం విపత్తు నిర్వహణ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు 45,281 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని మొత్తం 391 సహాయక శిబిరాలకు తరలించి.. వారికి కావాల్సిన నిత్యావసరాలను, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు.