అసోం ప్రజలు వరద గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 26 జిల్లాల్లోనూ వరద ఉద్దృతి కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇందు వల్ల నదీ పరివాహక ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. దీంతో 74 రెవిన్యూ ప్రాంతాలు, 2,634 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 93 మంది మృత్యుఒడికి చేరారు.
రాష్ట్రవ్యాప్తంగా 28,32,410 మంది ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు 456 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి.. తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1,19,435 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది.