అశోక్ ఖేమ్కా...ఈ పేరు వినగానే ముక్కుసూటి, నిజాయితీ అధికారి గుర్తొస్తారు. ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన చరిత్ర ఆయనది. అందుకు ఆయనకు దక్కిన ఫలితం... బదిలీల మీద బదిలీలు.
2012లో యూపీఏ హయాంలో ఖేమ్కా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. హరియాణాలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఎన్నోసార్లు బదిలీ అయ్యారు. కారణం... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవడమే.
ఇవీచూడండి:
వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం!
పట్నాయక్ లక్ష్యం 'పాంచ్ పటాకా'
వాద్రా అంశంలో సంచలనం....
2012లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సంస్థ- డీఎల్ఎఫ్ మధ్య భూ ఒప్పందాన్ని రద్దు చేసి సంచలనం సృష్టించారు ఖేమ్కా. ఈ ఒప్పందం విలువ రూ. 20వేల కోట్ల నుంచి 3 లక్షల 50 వేల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. వాద్రా తక్కువ ధరలకు భూమి కొనుగోలు చేసి... ఖరీదైన ధరలకు విక్రయించేవారనేది ఖేమ్కా ఆరోపణ.
వాద్రా అంశంతో మొదలు అనేకసార్లు యూపీఏ హయాంలో ఆయనను తరచూ బదిలీ చేసేవారు. అప్పట్లో ఖేమ్కా బదిలీలపై తీవ్రంగా మండిపడేది భాజపా. పలుమార్లు ఈ ఐఏఎస్ అధికారికి బాసటగా నిలిచింది కమలదళం. హరియాణాలో భాజపా అధికారంలోకి వచ్చాక కేంద్ర సర్వీసులోకి తీసుకోవాలని పీఎంఓకి సిఫార్సు చేశారు. కానీ, ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు.
హరియాణాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఖేమ్కాపై అదే బదిలీల అస్త్రం ప్రయోగిస్తూ కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోంది.
15 నెలల క్రితమే హరియాణా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు అశోక్ ఖేమ్కా. 2019 మార్చి 3న శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇది పెద్దగా ప్రాముఖ్యం లేని, నామమాత్రమైన పదవి. ఖేమ్కా ఉద్యోగ జీవితంలో 52వ బదిలీ.
- ఖట్టర్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి హుడా హయాంలో 22 సార్లు బదిలీ అయ్యారు ఖేమ్కా.
- నాలుగున్నరేళ్ల భాజపా పాలనలో ఖేమ్కాకు ఆరో బదిలీ.
- శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా కాకముందు 15 నెలలు హరియాణా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా చేశారు.
- అంతకుముందు సామాజిక, న్యాయ సాధికారత విభాగంలో పనిచేశారు. అక్కడ ఉంది 3 నెలలే.
ఇదే కారణమా...?
ఆరావళి పర్వత శ్రేణుల్లో ఫరీదాబాద్ వద్ద అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా ఖేమ్కా 2012లో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా.. ఆ ఆదేశాలు రద్దు చేస్తూ సవరణలు చేసింది.
ఫలితంగా.. 3100 ఎకరాలు భూమిని అటవీ ప్రాంతం నుంచి తొలగించారు.
దీనిపై స్పందించిన ఖేమ్కా... అక్రమ నిర్మాణాలు పర్యావరణ సమతుల్యానికి నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరాస్తి వ్యాపారులకు లాభం చేకూర్చడం కోసమే ఇలా చేస్తున్నారని.. ఇది ఏ మాత్రం సరైనది కాదని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల భూదాహానికి పర్యావరణం బలైపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఖట్టర్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది అత్యున్నత న్యాయస్థానం.
వెంటనే... అశోక్‌పై బదిలీ వేటు పడింది. 'ఆరావళి పర్వత శ్రేణుల్లో భూముల ఏకీకరణ' అంశంపై వ్యాఖ్యలే బదిలీకి కారణమని ఖేమ్కా భావిస్తున్నారు.
కోర్టుకెక్కిన ఖేమ్కా....
పంజాబ్, హరియాణా హైకోర్టులో ఖేమ్కా పిటిషన్ తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వ వైఖరిపై కోర్టుకెక్కారు ఖేమ్కా. వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లో నెగెటివ్ మార్కింగ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ... కుమారుడు, న్యాయవాది నాథ్ ఖేమ్కా ద్వారానే పిటిషన్ దాఖలు చేశారు. అలా చేయడం వల్ల తన పదోన్నతికి ఆటంకం ఏర్పడిందన్నది ఆయన వాదన. దీనిపై తీర్పును పంజాబ్, హరియాణా హైకోర్టు రిజర్వులో ఉంచింది.
ఖేమ్కా మొదట ఈ అంశంపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(సీఏటీ) ను ఆశ్రయించారు. కానీ, అక్కడ తిరస్కరణకు గురైంది. హైకోర్టుకు వెళ్లారు.
అంకెల గారడీ...
1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 2016-17 వార్షిక ఏడాది జూన్ 7 తో ముగిసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ దేసీ.. ఖేమ్కా పనితీరుపై 10 పాయింట్లకుగానూ 8.22 ఇచ్చారు. జూన్ 27న క్రీడలు, యువజన శాఖ మంత్రి అనిల్ విజ్ 9.92 పాయింట్లు ఇవ్వడం విశేషం.
హరియాణా క్రీడల మంత్రి అనిల్ విజ్ మూడేళ్ల పదవీకాలంలో అశోక్ ఖేమ్కాను రాష్ట్ర క్రీడల మంత్రి అనిల్ విజ్ ఉత్తమ అధికారిగా గుర్తించారు.
''నేను ఇప్పటివరకు దాదాపు 20 మంది అధికారులతో కలిసి పనిచేశాను. వారందరిలో అశోక్ ఖేమ్కానే ప్రత్యేకం. ద బెస్ట్. ఆయన ఎంతో నిజాయితీపరుడు, కష్టపడే తత్వమున్న వ్యక్తి.''
- హరియాణా మంత్రి అనిల్ విజ్
ఏసీఆర్ నివేదిక ఖట్టర్‌కు 2017 డిసెంబర్ 31న చేరింది. దీనిని పరిశీలించిన ముఖ్యమంత్రి.... మంత్రి అనిల్ విజ్‌కు లేఖ రాశారు. ఖేమ్కా పనితీరును అతిగా చూపారని.. పాయింట్లను 9.92 నుంచి 9కి తగ్గించారు. ఈ మార్పుతో... కేంద్రంలో అదనపు కార్యదర్శి పదవి వస్తుందన్న కల చెదిరినట్టేనని హైకోర్టును ఆశ్రయించారు ఖేమ్కా.
నిజానికి... ఐఏఎస్ పనితీరు లెక్కల్లో 10 పాయింట్లకు 9 రావడమూ గొప్పగానే భావిస్తారు.
ఇదీ చూడండి:పేరు మార్చుకున్న మోదీ, షా!