రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. రెబల్ నేత సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ వేటు వేయడంవల్ల రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సచిన్‌ను పార్టీ పదవుల నుంచి తప్పించిన కొద్ది సేపటికే.. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. సచిన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదించారు గహ్లోత్. ఈ ప్రతిపాదనను గవర్నర్ వెంటనే ఆమోదించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన గహ్లోత్.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచిన్.. భాజపా చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చిన విధంగానే రాజస్థాన్‌లోనూ భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు.
"నిజానికి పైలట్ చేతిలో కూడా ఏమీ లేదు. ఇదంతా భాజపా పన్నిన కుట్ర. పైలట్ భాజపా చేతుల్లోకి వెళ్లిపోయారు. రిసార్టులను ఏర్పాటు చేసింది భాజపానే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది."
--- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి.
సచిన్ పైలట్‌తో పాటు ఆయన అనుచరులకు కాంగ్రెస్ అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు గహ్లోత్. అయినప్పటికీ పైలట్ రెబల్‌గా మారడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
సచిన్‌తో పాటు ఆయన మద్దతుదారులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది కాంగ్రెస్.
'అవన్నీ తప్పుడు ఆరోపణలు...'
రాజస్థాన్ సంక్షోభం వెనక తమ హస్తం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను భాజపా ఖండించింది. పార్టీ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భాజపా రాజస్థాన్ ఇన్ఛార్జ్ అవినాశ్ రాయ్ ఖన్నా స్పష్టం చేశారు.