దేశ రాజధాని నడిబొడ్డులో నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్భయపై కామాంధుల కర్కశ చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. ఏడేళ్ల తర్వాత దోషులను ఉరి తీయటంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. నిర్భయ ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఆనాటి సంఘటనలపై పలు విషయాలను ఈటీవి భారత్తో వెల్లడించారు నిర్భయ తల్లి ఆశాదేవి. బాధితులు సత్వర న్యాయం పొందాలంటే న్యాయవ్యవస్థలో మార్పులు అవసరమని తెలిపారు. వ్యవస్థలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయన్నారు.
తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయా..
తన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కనీసం చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఆశాదేవి.
"ఘటన తర్వాత 12-13 రోజుల వరకు ఆమె బతికే ఉన్నా.. తను నీరు కూడా తాగలేని స్థితిలో ఉంది. ఆమె శరీరం నీటిని కూడా తీసుకోలేని స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. ఇప్పటికీ తనకు తాగడానికి చుక్కనీరు ఇవ్వలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతోంది."
- ఆశా దేవి, నిర్భయ తల్లి