తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కొత్త ట్విస్ట్​.. రాష్ట్రపతి పాలన విధింపు..! - రాష్ట్రపతి పాలనకు గవర్నర్​ సిఫార్సు

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్​ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకై ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్​ సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదముద్ర వేయడమే తరువాయి. అయితే.. గవర్నర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ శివసేన... సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

'మహా'లో కొత్త ట్విస్ట్​.. రాష్ట్రపతి పాలన విధింపు..!

By

Published : Nov 12, 2019, 4:56 PM IST

క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమవుతున్నందున గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. రాష్ట్రపతికి నివేదిక అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పార్టీలు విఫలమైనందున కేంద్ర కేబినెట్​ కూడా.. గవర్నర్​ సిఫార్సును ఆమోదించింది.

అయితే... గవర్నర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది శివసేన. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు అదనపు గడువు కోరితే గవర్నర్​ ఇవ్వనందుకు సేన.. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్​ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన సేన.. ఈ పిటిషన్​పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. శివసేన తరఫున కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ వాదించనున్నారు.

శివసేనకు కాంగ్రెస్​ షాక్​..

గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి 3 రోజుల గడువు ఇవ్వాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని శివసేన అభ్యర్థించింది. ఇందుకు ఆయన నిరాకరించారు.
ఆ తర్వాత కాసేపటికే మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. ఆ పార్టీకీ ఇవాళ రాత్రి 8.30 గంటల వరకు గడువు విధించారు. ఆ డెడ్​లైన్​ ముగియకముందే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించగా.. ఆ పార్టీ తాము అందుకు సిద్ధంగా లేమని గవర్నర్​కు తెలిపింది.

కాంగ్రెస్​ చర్చిస్తుండగానే....

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్​, ఎన్సీపీ మధ్య చర్చలు జరుగుతుండగానే... కేంద్రం రాష్ట్రపతి పాలనకు అంగీకారం తెలపడం గమనార్హం. ముంబయిలో ఎన్సీపీతో చర్చలు జరిపే బాధ్యతలను.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు సీనియర్లకు అప్పగించారు. అహ్మద్​ పటేల్​, మల్లికార్జున్​ ఖర్గే, కేసీ వేణుగోపాల్​లు.. పవార్​తో భేటీ కానున్నారు. అనంతరం.. ఈ రెండు పార్టీల మద్దతు వైఖరిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. అంతకుముందు సోనియా కూడా పవార్​తో ఫోన్​లో సంభాషించారు. ఇవాళ ఉదయం తన నివాసంలో కాంగ్రెస్​ కోర్​కమిటీ సభ్యులతోనూ ఈ అంశంపై చర్చించారు. ఈ పరిణామాల నడుమ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్​ల మద్దతు కోసం ఎదురుచూస్తోంది.

For All Latest Updates

TAGGED:

MAHARASHTRA

ABOUT THE AUTHOR

...view details