పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 2022 ఆగస్టు 15 నాటికి మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో మొదటి మానవ రహిత గగన్యాన్ ప్రయోగం చేపట్టనుంది. ఈ పరీక్షలో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు.. అచ్చం మనిషిలాగే ప్రవర్తించే హాఫ్ హ్యూమనాయిడ్ రోబో 'వ్యోమ మిత్ర'ను రూపొందించింది. వ్యోమమిత్రను పరీక్షించిన ఆరునెలల అనంతరం మరోమారు మానవ రహిత గగన్యాన్ ప్రయోగం చేపట్టనుంది.
అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్న 'లేడీ రోబో'
2022 ఆగస్టు 15 నాటికి మానవ సహిత గగన్యాన్ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని పట్టుదలగా ఉంది ఇస్రో. ఇందుకోసం ముందుగా రెండు మానవ రహిత గగన్యాన్ ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ఏడాది చివర్లో చేపట్టే మొదటి ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు హాఫ్ హ్యూమనాయిడ్ రోబో 'వ్యోమ మిత్ర' ను రూపొందించింది. అలాగే మానవ సహిత ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ఇస్రో ఛైర్మన్ స్పష్టం చేశారు.
ఆ తర్వాత 2022లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ఇస్రో ఛైర్మన్ కె శివన్ తెలిపారు. వీరికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యా సాయంతో 1984లో తొలిసారి అంతరిక్షం చేరగా ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత వ్యోమగాములు రోదసిలోకి వెళ్లనున్నట్లు శివన్ తెలిపారు.
" ముందుగా అనుకున్న తేదీ ప్రకారమే గగన్యాన్ ప్రయోగం చేపడతాం. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు కూడా ఎంపికయ్యారు. శిక్షణ నిమిత్తం ఈనెలాఖరుకల్లా వారందరూ రష్యాకు వెళ్తారు. అంతరిక్ష శిక్షణ మాత్రమే కాకుండా పర్యావరణ వ్యవస్థ, జీవశాస్త్రం వంటి అంశాల్లోనూ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నాం. కేవలం రష్యా, నాసా నుంచి మాత్రమే కాకుండా ఇతర సంస్థల నుంచి కూడా అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎక్కడైనా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటే శిక్షణా సంస్థల సహకారంతో కలిసి వారికి శిక్షణ ఇస్తున్నాం.
- కె శివన్, ఇస్రో ఛైర్మన్