దివంగత భాజపా నేత అరుణ్ జైట్లీ ప్రథమ వర్థంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
కేవలం రాజకీయనాయుడిలానే కాక గొప్ప న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన జైట్లీ బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు ఉపరాష్ట్రపతి.
దేశానికి నిష్పక్షపాతంగా సేవలందించిన మంచి మిత్రుడిని కోల్పోయానంటూ, జైట్లీ జ్ఞాపకాలను ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
" గతేడాది ఇదే రోజు శ్రీ అరుణ్ జైట్లీని మనం కోల్పోయాం. నా స్నేహితుడిని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. జైట్లీ దేశానికి నిష్పక్షపాతంగా సేవలందించారు. ఆయన ఉదారమైన, చట్టపరమై చాతుర్యం, సున్నితమైన వ్యక్తిత్వం మరువలేనివి. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అరుణ్ జైట్లీతో సమతూగే నాడకుడు భారత రాజకీయాల్లోనే లేరని గుర్తు చేసుకున్నారు షా.
"అరుణ్ జైట్లీ ఓ అత్యుత్తమ రాజకీయ నాయకుడు. గొప్ప వక్త. భారత రాజకీయాల్లో సాటి లేని గొప్ప వ్యక్తి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందరికో ఆప్త మిత్రుడు. ఆయన ఆలోచనా విధానం, ఆయన దేశభక్తి ఎప్పటికీ మరచిపోలేనిది. "
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
కేంద్ర నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్విట్టర్ లో జైట్లీకి నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని పేర్కొన్నారు.
"అరుణ్ జైట్లీ నాకు కూడా ఓ పొడుపు కథే. ఏళ్ల తరబడి, ఆయన నా దినచర్యలో ఒక భాగంగా ఉన్నారు. కానీ, 24 ఆగస్టు 2019 తర్వాత అంతా మారిపోయింది. నాకు మిత్రుడు, మార్గదర్శకుడు, గురువు .. అన్నీ ఆయనే. జైట్లీ స్థానాన్ని భర్తీ చేయలేం. "
- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి
మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సైతం అరుణ జైట్లీని స్మరిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో జైట్లీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బిహార్ ఎన్నికల్లో సరికొత్త నియమాల తో 'రణం'