తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కృత్రిమ మేధతోనే 'అన్నదాత'కు బంగారు భవిష్యత్తు! - కృత్రిమ మేధ

కృత్రిమ మేధ.... సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం. స్వీయ నిర్ణయాలతో ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల అద్భుతం. అలాంటి సాంకేతికతను వ్యవసాయ రంగంతో జోడిస్తే ఏమవుతుంది? ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొని, అధిక దిగుబడి వచ్చేలా చేయడంలో కృత్రిమ మేధ ఎలాంటి పాత్ర పోషించే అవకాశముంది?

కృత్రిమ మేధ
కృత్రిమ మేధ

By

Published : Jan 23, 2020, 3:18 PM IST

Updated : Feb 18, 2020, 2:58 AM IST

వ్యవసాయం.. మానవాళికి తెలిసిన అతి పురాతనమైన వృత్తి. మనుషులు జీవించేందుకు అత్యంత ప్రధానమైనది. కర్షక రంగం తరాలు మారుతున్న కొద్దీ ఎన్నో పరిస్థితులను తట్టుకుని నిలబడింది. అనేక సవాళ్లను ఎదుర్కొంది. గతంతో పోలిస్తే అవసరాలను బట్టి ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనసంఖ్యకు అనుగుణంగా నాణ్యత, పరిమాణానికి డిమాండ్​ ఏర్పడింది. ఫలితంగా అధునాతన సాంకేతికత ఆవిష్కరణల సాయంతో స్థిరంగా.. మరింత వేగంతో ముందుకు సాగుతోంది సేద్యం.

హరిత విప్లవంతో..

భారత్​.. ఆహార అవసరాల కోసం రోజువారీ దిగుమతులపై ఆధారపడిన దేశం. కానీ ఇప్పుడు ఆహారోత్పత్తిలో వచ్చిన మార్పులతో దేశ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం. ఇందుకు హరిత విప్లవం, సాంకేతికత ఆవిష్కరణలే కారణం. హరిత విప్లవానికి ముందు 5 కోట్ల టన్నులు ఉన్న భారత ఆహారోత్పత్తి నేడు 30 కోట్ల టన్నులకు చేరింది.

హరిత విప్లవంతో భారత వ్యవసాయ రంగంలో సాంకేతికత అంతర్భాగమైంది. సమాచార సాంకేతికత ప్రవేశంతో వ్యవసాయాన్ని మరింత ముందుకు నడిపించింది. కర్షక రంగంలో ఉత్పాదకత, వాస్తవికత, కచ్చితత్వం పెరిగింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా నడుస్తోంది. వ్యవసాయంలోనూ ఈ సాంకేతికత ప్రవేశిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

మానవ జోక్యం తగ్గించి..

కృత్రిమ మేధ (ఏఐ).. మానవ ఆలోచనలను ఆధారంగా కచ్చితత్వంతో పనిచేస్తుంది. మానవ జోక్యాన్ని తగ్గించి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. బహుళ స్థాయుల్లో నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యవసాయ రంగానికి కృత్రిమ మేధ ఎంతో అనుకూలంగా ఉంటుంది. మానవ నిర్ణయాలతో తప్పిదాలు జరిగితే పంట నష్టపోయి ఆహార కొరత అధికమవుతుంది. పెరుగుతున్న జనాభాతో భవిష్యత్తు ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుంటే ఈ చర్య చాలా నష్టం కలిగిస్తుంది.

అందుకే ప్రపంచ దేశాలన్నీ వ్యవసాయ రంగంలో పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2025 నాటికి కర్షక రంగంలో కృత్రిమ మేధ మార్కెట్​ 155 కోట్ల డాలర్లకు చేరుతుందని విశ్లేషకుల అంచనా.

కచ్చితమైన ఫలితం..

వ్యవసాయంలో అన్ని దశల్లో ముఖ్యంగా పంట ఎంపిక, నిర్వహణ, అంచనా వేసేందుకు కృత్రిమ మేధ ఉపయోగకరంగా ఉంటుంది.

భారత్​లో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. దేశ వ్యవసాయ రంగ జీడీపీలో 60 శాతం వాటా వర్షాధార పంటలదే కావటం విశేషం. ఈ నేపథ్యంలో వాతవరణ సంభావ్యతలను తట్టుకునేలా వ్యవసాయ ప్రణాళికలు అవసరం. ప్రాంతాలను బట్టి నేల, నీటి లభ్యత లాంటి అంశాల్లో వైరుధ్యం వల్ల ఎప్పుడూ ఒకే పంటను వేసి విజయం సాధించలేం.

ఇలాంటి పరిస్థితుల్లో కృత్రిమ మేధ నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ పంట వేయాలి? పరిస్థితులకు తగినట్లు ఎలా వ్యవహరించాలి? స్థానిక పరిస్థితులు, మార్కెట్ డిమాండ్​, ధరలు.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలదు.

మైక్రోసాఫ్ట్​ చొరవతో..

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ ప్రవేశం కోసం ఇక్రిశాట్​తో కలిసి మైక్రోసాఫ్ట్​ 'భూచేతన' అనే పైలట్​ ప్రాజెక్టు ప్రారంభించింది. దీని ద్వారా ఖరీఫ్ సీజన్​లో విత్తనాల సలహాల సేవలను అందించనుంది. రైతులు ఏ సమయంలో విత్తనాలు వేయాలో తేదీలతో సహా సలహాలు ఇస్తుంది.

సేద్యంలో కృత్రిమ మేధ ప్రవేశిస్తే నేల, పంటలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించటం సాధ్యమవుతుంది. ఇమేజ్​ ప్రాసెసింగ్​తో పంట వ్యాధులు, తెగులు సంక్రమణలను గుర్తించవచ్చు. వ్యాధుల తీవ్రతను బట్టి నిర్మూలన, నివారణ సలహాలు పొందవచ్చు. కృత్రిమ ఉపగ్రహాలు, డేటా సిగ్నళ్ల ద్వారా ఎలాంటి పరీక్షలు జరపకుండానే నేల స్థితిని అంచనా వేసి.. తక్షణమే నివారణ చర్యలు చేపట్టవచ్చు.

ప్రభుత్వ చొరవతో వచ్చిన వ్యవసాయ ఎగుమతుల విధానం-2018.. భారత రైతుల మార్కెట్ పరిధిని పెంచింది. ఆహారోత్పత్తిలో ప్రమాణాలు పెంచాలన్నది ఈ పాలసీ మరో ఆశయం. కృత్రిమ మేధతోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను భారత్​ అందిపుచ్చుకోగలుగుతుంది. ఏఐతో మానవ జోక్యం లేకుండా ఉత్పత్తుల నాణ్యత, రంగు, రుచి, తాజాదనం తదితర అంశాలను గుర్తించి ధరలు నిర్ణయించే అవకాశం ఉంటుంది.

కృత్రిమ మేధతో ఉన్న మరో ప్రయోజనం భవిష్యత్తు విశ్లేషణ. అందుకే చిన్నకారు రైతులకు సహకారంగా ఉండేలా మద్దతు ధర అంచనా కోసం మైక్రోసాఫ్ట్​తో కర్ణాటక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ ధరల కమిషన్​(కేఏపీసీ)తో కలిసి పనిచేయనుంది మైక్రోసాఫ్ట్. నేల, విత్తనాలు, కాలం, వాతావరణ అంశాలను పరిశీలించి ధరలను నిర్ణయిస్తుంది. భారత్​లో అతిపెద్ద సేద్య రసాయనాల ఉత్పత్తి సంస్థ యునైటెడ్​ ఫాస్పరస్​తో కలిసిన మైక్రోసాఫ్ట్​.. కీటకాలతో కలిగే నష్టాన్ని అంచనా వేసే అప్లికేషన్​ను తయారుచేయనుంది.

ఏఐ అవసరాన్ని గుర్తించిన నీతి ఆయోగ్​..

'జాతీయ కృత్రిమ మేధ వ్యూహం'పై నీతి ఆయోగ్​ 2018లో చర్చించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్​లో కృత్రిమ మేధ ఆవశ్యకతను గుర్తించింది. ప్రపంచ దేశాల సరసన నిలిచేందుకు వ్యవసాయం సహా 5 రంగాల్లో కృత్రిమ మేధ ప్రవేశం అవసరమని తేల్చింది.

భారత్​లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతులపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల కొంతమేర అనిశ్చితి నెలకొంటోంది. వాతావరణం, రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రకృతి వైపరీత్యాలు ఈ రంగంపై ప్రభావం చూపిస్తాయి. ఈ సవాళ్లన్నింటినీ ఏఐతో అధిగమించవచ్చు. కొన్ని అంశాల్లో కృత్రిమ మేధ అందించే ముందస్తు సమాచారంతో పంట నష్టాన్ని నివారించవచ్చు. అలా సేద్యంలో కృత్రిమ మేధ కొత్త శకాన్ని ప్రారంభిస్తుందనడంలో సందేహం లేదు.

(రచయిత- డాక్టర్​ ఎంజే ఖాన్​, ఛైర్మన్​-ఇండియన్ ఛాంబర్​ ఆఫ్​ ఫుడ్​ అండ్ అగ్రికల్చర్​)

Last Updated : Feb 18, 2020, 2:58 AM IST

ABOUT THE AUTHOR

...view details