అందరితో కలిసి.. అందరి వికాసానికి (సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్) అంటూ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ సర్కారు శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్రవేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నామని చెబుతూ.. పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే సాహసోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది. చివరి నెలల్లో కరోనా విరుచుకుపడినప్పటికీ.. మహమ్మారి బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. నవ భారత నిర్మాణమే లక్ష్యమంటూ మోదీ ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనను అవలోకనం చేసుకుందాం..
ముస్లిం మహిళలకు అండ
ముస్లిం మహిళల గౌరవ, ప్రతిష్ఠలను కాపాడటం.. వారి వివాహ హక్కులకు రక్షణ కల్పించడం అనే లక్ష్యాలతో తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును 2019 జులై 30న పార్లమెంటు ఆమోదించడం చారిత్రక నిర్ణయం. తొలినుంచీ ముస్లిం మహిళల వివాహ హక్కుల కోసం బలంగా వాదిస్తూ వచ్చిన మోదీ రెండోసారి గెలుపొందిన తర్వాత.. పార్లమెంటు మొదటి సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపజేశారు. ఆగస్టు 1న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టరూపం దాల్చింది. దీని ప్రకారం - ముస్లిం వివాహిత వ్యక్తి మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకోవాలని చూస్తే అది నేరం. మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ఈ బిల్లు ఆమోదించినపుడు కొన్నిపార్టీలు, వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా.. మొత్తంమీద ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్న భావన వ్యక్తమైంది.
'అయోధ్య' రాముడిదే
స్వతంత్ర భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన రామ జన్మభూమి అంశానికి మోదీ రెండోదఫా పాలనలోని తొలి ఏడాదిలోనే న్యాయప్రక్రియ ద్వారా పరిష్కారం లభించింది. ఈ కేసులో వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను రామ జన్మభూమి ట్రస్ట్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టు 2019 నవంబరు 9న తుదితీర్పు ఇచ్చింది. నిజానికి పరిష్కారం చూపింది సుప్రీంకోర్టే అయినప్పటికీ.. పరిస్థితిని చక్కబెట్టడంలో, భద్రత ఏర్పాట్లు చేపట్టడంలో మోదీ సర్కారు చాకచక్యంగా వ్యవహరించింది.
మూడు నెలల్లోపు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దానికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్థలాన్ని స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఈఏడాది ఫిబ్రవరి 5న లోక్‌సభ వేదికగా 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్‌ను ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి సేకరించిన 62.23 ఎకరాల భూమిని దానికి స్వాధీనం చేశారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి పనులు ప్రారంభం అవుతాయని అంతా భావించినా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్య అత్యంత కీలకాంశం. దీనికి న్యాయస్థానం ద్వారా పరిష్కారం లభించడం వల్ల మొత్తం కార్యక్రమం అత్యంత శాంతియుతంగా జరిగిపోయింది.
'370' రద్దు.. చరిత్రాత్మకం
చరిత్రలో నిలిచిపోయే కొన్ని తేదీల్లో '2019 ఆగస్టు 5' కూడా ఒకటి. ఏళ్ల తరబడి రాచపుండులా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారానికి నాంది పలికిన రోజది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయమే జమ్మూ-కశ్మీర్ విభజన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద జమ్మూ-కశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ సర్కారు రద్దుచేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.