తెలంగాణ

telangana

ETV Bharat / bharat

370 రద్దుతో కశ్మీర్​లో వచ్చే మార్పులివే... - effect

జమ్ము కశ్మీర్​లో సమస్యల పరిష్కారానికి కేంద్రం మొదటి అడుగు వేసింది. రాష్ట్రంలో కేంద్రం జోక్యానికి అడ్డుగా ఉన్న ఆర్టికల్​ 370 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు భారత్​ ఏకమయింది. ఈ ఆర్టికల్​ రద్దుతో కశ్మీర్​లో కీలక మార్పులు రాబోతున్నాయి.

ఆర్టికల్​ 370

By

Published : Aug 5, 2019, 6:12 PM IST

వారం రోజులుగా వినిపిస్తున్న 'ఆపరేషన్​ కశ్మీర్'​ ఊహాగానాలను నిజం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్​ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది కేంద్రం. 1950లో స్వదేశీ సంస్థానాలు భారత సమాఖ్యలో విలీనమయిన తరహాలోనే కశ్మీర్​ దేశంలో పూర్తిగా ఐక్యం కాబోతుంది.

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్​ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 35ఏ కూడా రద్దవుతుంది. ఆర్టికల్​ 35ఏ ప్రకారం రాష్ట్రంలో భూమి కొనుగోళ్లు, వ్యాపారం, ఉద్యోగాలకు స్థానికులకే అవకాశం ఉంటుంది.

వచ్చే మార్పులివే...

  1. కేంద్రం నిర్ణయంతో ఇప్పటి వరకు రాష్ట్రంగా కొనసాగుతున్న జమ్ము కశ్మీర్‌.. కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. దిల్లీ, పుదుచ్ఛేరి తదితర కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగా దీనిపై కేంద్రానికి విశేష అధికారాలు ఉండనున్నాయి.
  2. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్‌ గవర్నర్ల ఆధీనంలోకి వస్తాయి. కేంద్ర హోంశాఖ నియంత్రణలో విధులు నిర్వర్తించే ఎల్జీకి స్థానిక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అంతిమ పాలనాధికారం ఉంటుంది.
  3. జమ్ము కశ్మీర్‌కు అసెంబ్లీ ఉన్నప్పటికీ.. దిల్లీ ప్రభుత్వం తరహాలోనే పోలీసు యంత్రాంగం, భూముల నిర్వహణపై ఎలాంటి అధికారాలు ఉండవు.
  4. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ప్రతి అంశంలో కేంద్ర హోంశాఖకు విశేష అధికారాలు ఉంటాయి.
  5. పార్లమెంటులో చేసే ప్రతి చట్టం ఇక జమ్ముకశ్మీర్‌లోనూ అమలు కానుంది. దేశ పౌరులందరకీ కల్పించిన హక్కులు కశ్మీర్​లోనూ వర్తిస్తాయి.
  6. ప్రత్యేక పౌరుడిగా కశ్మీరీలకు గుర్తింపు పోతుంది. ఫలితంగా భారత పౌరుల్లానే ఇతర రాష్ట్రాల్లో చదువు, ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. బయట నుంచి పెట్టుబడులు పెరిగి కశ్మీర్​లో​ అన్ని రంగాలు అభివృద్ధి బాట పడతాయని నిపుణుల అభిప్రాయం. నాణ్యమైన విద్యాసంస్థలు పెరుగుతాయి.
  7. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల క్రయవిక్రయాలు చేపట్టే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా జమ్ము కశ్మీర్‌,లద్దాఖ్‌లో భూములను కొనుగోలు చేయొచ్చు. అమ్మొచ్చు.
  8. లద్దాఖ్‌ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలంటూ ఉండవు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
  9. లద్దాఖ్‌ ప్రాంతానికి జమ్ము కశ్మీర్‌తో సంబంధాలు ఉండవు. ఈ ప్రాంత అభివృద్ధిలో నేరుగా కేంద్రం జోక్యం ఉండనుంది.
  10. లద్దాఖ్‌ ప్రాంతంలో ఉన్న రెండు జిల్లాలైన లేహ్‌, కార్గిల్‌ ఇప్పటికే కొంత స్వయం ప్రతిపత్తిని పొందుతున్నాయి. పాక్షికంగా కొండ ప్రాంత అభివృద్ధి మండలి కింద వీటి పాలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

న్యాయనిపుణల మాట ఇదీ..

ఆర్టికల్​ 370 రద్దును ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్​ స్వాగతించారు. 70 ఏళ్ల కల సాకారం చేసిన మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో జమ్ము కశ్మీర్​లో వచ్చే కీలక మార్పులను వివరించారు.

అశ్విని ఉపాధ్యాయ్​, ప్రముఖ న్యాయవాది

"కశ్మీర్​లోని ప్రత్యేక జెండా, రాజ్యాంగం, చట్టాలకు ముగింపు ఇది. భారత పౌరులందరూ కశ్మీర్​ వెళతారు. వాళ్లు ఇక్కడికి వస్తారు. ఈ రకంగా సంబంధాలు బలపడతాయి.

35ఏ రద్దయిన నేపథ్యంలో కశ్మీరీ మహిళలకు హక్కులు సిద్ధిస్తాయి. ఇప్పటి వరకు రాష్ట్రేతర వ్యక్తిని పెళ్లి చేసుకున్న కశ్మీరీ మహిళలకు తండ్రితండ్రుల ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదు. ఉదాహరణకు.. మాజీ సీఎం ఒమర్​ అబ్దుల్లా కశ్మీరేతర వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఆస్తి హక్కు వస్తుంది. కానీ ఆయన సోదరి సారా అబ్దుల్లా రాష్ట్రేతర వ్యక్తిని వివాహమాడారు. ఆమె ఆస్తి హక్కు కోల్పోయారు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

కొన్నేళ్లుగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వాళ్లకు కశ్మీరీ పౌరులకు ఉన్న హక్కులుండేవి కాదు. ఇప్పుడు వాళ్లకు స్థానిక హోదా వస్తుంది. విద్య, ఉద్యోగాల్లో అవకాశం వస్తుంది.

కశ్మీర్​లో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయి. అవినీతిపరులపై వేటు పడుతుంది. దేశంలో అమలు చేస్తోన్న అవినీతి చట్టాలు కశ్మీర్​లో అమలు కావటం లేదు. ఇప్పుడు ఈ చట్టాలు అక్కడ చెల్లుతాయి. ఇక అవినీతిపరుల దుకాణం బంద్​ అవుతుంది.

ఈ విషయంలో అంతర్జాతీయ జోక్యం ఉండదు. ఇది భారత్​ అంతర్గత విషయం. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమే. కొన్నేళ్ల కోసమే ఈ నిబంధన పెట్టారు. దీనికి ముగింపు పలికారు. ఇక ఆర్టికల్ 35ఏ విషయంలో పార్లమెంటులో అసలు చర్చే జరగలేదు."

-అశ్విని ఉపాధ్యాయ్​, ప్రముఖ న్యాయవాది

ఇదీ చూడండి: 'మోదీ మార్క్' సాహసం... ఆపరేషన్​ కశ్మీర్​

ABOUT THE AUTHOR

...view details