ప్రతి విపత్తు తర్వాత ఓ కొత్త సృజన ఉద్భవిస్తుందని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగిందో.. మనం చూడొచ్చని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురువు శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఆ సమయంలో అనేక దేశాలు నేలమట్టమయ్యాయని.. ఇప్పుడు ఆ దేశాలు ఎలా అభివృద్ధి చెందాయో చూడవచ్చన్నారు.
కోలుకోవడానికి 15 నెలలు
'ప్రస్తుత కొవిడ్-19 ప్రపంచయుద్ధానికి తక్కువేమీ కాదు. ఆయుధాలు వాడని యుద్ధం ఇది. మొత్తం మానవాళిపై ఎప్పుడూ చూడని దాడి! ఈ గ్లోబల్ యుద్ధం తర్వాత.. మన దేశం, ఈ ప్రపంచం మరింత దయగల, సమృద్ధ సమాజంగా మారుతుందని నమ్ముతున్నా. ఈ ప్రపంచం మళ్లీ సౌకర్యవంతం కావడానికి 15 నెలలు పట్టవచ్చు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఓర్పు కలిగి ఉందాం. శక్తిని పెంచుకుందాం. మరిచిపోయిన మానవత్వాన్ని మేల్కొలుపుదాం. వినిమయతత్వాన్ని తగ్గించుకుందాం. మనం అనుసరిస్తున్న చచ్చేంత పోటీని తగ్గిద్దాం. మోసపూరిత, నేరమయ సమాజం నుంచి మరింత సహకార, బుద్ధిపూర్వక సమాజంలోకి అడుగుపెడదాం. భూమిపై ఇప్పుడు యుద్ధోన్మాదం తగ్గింది.' అంటూ వివరించారు.
"స్వీయ వినాశనానికి చాలా చేశారు. ఇంకా వద్దు. అయిందేదో అయింది.. మానవుల్లారా మళ్లీ మేల్కోండి’’.. అని ప్రకృతి మనకు బోధిస్తోంది. ఈ భూమిపై అనేక యుద్ధాలు చేశాం. సమర్థించుకున్నాం. ఇప్పుడు ప్రకృతి చెబుతోంది.. జరిగింది చాలు.. హింసాప్రవృత్తికి, యుద్ధాలకు మూత పెట్టేయండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని పెంచండి."
శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు