మహాత్ముల కలలు సాకారం-కశ్మీర్ అభివృద్ధి దిశగా అడుగులు జమ్ముకశ్మీర్‌ను రక్షించేందుకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరులను జ్ఞాపకం చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ... కశ్మీర్ కోసం 42వేలమంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జమ్ముకశ్మీర్‌ను భారత కిరీటంగా అభివర్ణించారు.
1965లో పాకిస్థాన్ చొరబాట్లను గురించి భద్రతా సిబ్బందిని హెచ్చరించిన మౌల్వీ గులాముద్దిన్ను, గతేడాది ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన జవాన్ ఔరంగజేబును తన ప్రసంగంలో గుర్తు చేశారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనతో కశ్మీర్-లద్దాఖ్‌లో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఒకటే భారత్-ఒకటే రాజ్యాంగం అనే వల్లభాయ్‌పటేల్,శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వప్నం సాకారమైందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు.
విద్యాహక్కు చట్టం, కనీస వేతనాల చట్టం, మైనార్టీల రక్షణ చట్టం, SC-ST హక్కులకు సంబంధించిన రిజర్వేషన్లు, చట్టాలు... ఇన్నాళ్లూ కశ్మీర్‌లో అమలుకాలేదన్న మోదీ....ఇకపై అన్నీ చట్టాల ప్రయోజనాలూ కశ్మీరీలకూ అందుతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఉద్ఘాటించారు.
"గత మూడు దశాబ్దాల్లో 42వేల మంది నిర్దోషులైన ప్రజలు చనిపోవడం ఎవ్వరి కంట్లోనైనా కన్నీరు తెప్పిస్తుంది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ల అనుకున్నవిధంగా అభివృద్ధి జరగలేదు. శక్తివంతమైన రాజ్యాంగం ఉన్నప్పటికీ కశ్మీర్‌లో అమలులో లేదు... దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మైనారిటీల ఆసక్తులు కాపాడేందుకు చట్టాలున్నాయి...., కార్మిక సంక్షేమం కోసం కనీస వేతన చట్టం అమలులో ఉంది... కానీ ఇవేవి కశ్మీర్‌లో అమలులో లేవు... దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు ఉంటాయి. కానీ కశ్మీర్‌లో ఇవి అమల్లో లేవు... ఆర్టికల్ 370, 35ఏ రద్దు అనంతరం... వాటి ప్రభావం నుంచి కశ్మీర్ త్వరగా బయట పడుతుందని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక కర్తవ్యం ఏమిటంటే... కశ్మీర్‌లోని పోలీసులతో సహా కార్మికులందరికీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అలవెన్సులు, జీతాలు అందిస్తాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి