జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద కాపుగాసి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి చొరబడాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వీరంతా.. నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రముఠాలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం పరిస్థితుల్ని నిరంతరం సమీక్షిస్తోంది.
అప్రమత్తం..
కశ్మీర్లోని XV-కార్ప్స్కు నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.. చొరబాట్లకు అవకాశమున్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదలకుండా తనిఖీ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. తరచుగా వివిధ బృందాలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒకవేళ ఈ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులు, బలగాల మధ్య కాల్పులు జరిగితే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై కొన్ని సూచనలు చేశారు అధికారులు. ప్రత్యర్థులకు కరోనా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు.