'యతి'... ఎన్నో ఏళ్లుగా చాలా మందిని తొలిచేస్తోన్న ప్రశ్న. ఎంతోమంది తాము యతి అడుగుజాడలను చూశామని చెబుతూనే ఉన్నారు. అసలు ఈ యతి ఎవరు? హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఈ జీవి కథ కల్పితమా? లేక వాస్తవమా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే తాజాగా భారత సైన్యం అనుమానస్పద వింత జీవి కాలిముద్రల చిత్రాలను ట్విట్టర్లో పంచుకుంది. ఈ చిత్రాలను నిపుణుల పరిశీలనకు పంపాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 9న నేపాల్‌లోని మకాలూ బేస్ క్యాంప్‌నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని అనుమానస్పద పాదముద్రలు 32x15 అంగుళాల పరిమాణంలో కనిపించాయి. పర్వతారోహణ బృందం వీటి ఛాయచిత్రాలు, వీడియోలను తీసినట్లు సైన్యం వెల్లడించింది. ఆ చిత్రాలను ట్విట్టర్లో విడుదల చేసింది.
మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, లేక మరేదైనా వికృతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో వెల్లడించింది.