భారత సైన్యం కశ్మీర్‌లో ఉగ్రవాదులతో కఠినగా వ్యహరించినా.. స్థానికులతో స్నేహ పూర్వకంగా మెలుగుతుంది. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటుంది. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సైన్యం దృష్టికి వస్తే కచ్చితంగా సాయం చేస్తుంది.. యువతకు క్రీడా మైదానాలు సమకూర్చడం.. ఉపాధి శిక్షణ ఇప్పించడం.. ఉపాధి కల్పన మార్గాలు చూపించడం వంటివి సైన్యం చేస్తుంటుంది. సైనిక అధికారులు కూడా అక్కడి ప్రజలతో ప్రేమగా ఉంటూ వారి అవసరాలు తీరుస్తుంటారు. తాజాగా ఓ యువ మేజర్ కూడా ఇలాంటి పనే చేస్తున్నారు.
కశ్మీర్ రక్షణ బాధ్యతలు చూసే రాష్ట్రీయ రైఫిల్స్‌లో మేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కమలేష్ మణి ఒక రోజు చంజ్‌ముల్లా ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. అక్కడ గౌహుర్ మిర్ అనే 16ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు వినలేడు.. మాట్లాడలేడు. కొన్నాళ్ల తర్వాత కమలేష్ ఆ బాలుడిని ఆర్మీ క్యాంప్‌కు తీసుకొచ్చి.. ఒక జత బూట్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ మర్నాడే మిర్ ఒక బుట్ట నిండా యాపిల్స్‌ను తీసుకొచ్చి కమలేష్‌కు ఇచ్చాడు. మిర్ కుటుంబాన్ని ఒక రోజు కమలేష్ కలుసుకొన్నారు. ఆ బాలుడి చదువు, వైద్యానికి అవసరమయ్యే మొత్తం తాను భరిస్తానని వారికి చెప్పాడు. ఈ మాటతో ఆ బాలుడి కుటుంబం ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తమకు సాయం చేయడానికి ఒకరు వచ్చినందుకు సంతోషించింది. వాస్తవానికి కమలేష్ ఆ గ్రామానికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఈ ఏడాది ఆ గ్రామం వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక కల్నల్, మేజర్, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఆ గ్రామం నిత్యం నిఘా నీడన ఉంటుంది.
స్కూల్ మార్చి..
తొలుత మిర్ బారాముల్లాలోని ఒక పాఠశాలకు వెళ్లాడు. కానీ, అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మేజర్ కమలేష్ ఆ బాలుడిని హంద్వారాలోని మరో పాఠశాలలో చేర్చారు. అక్కడ మిర్ వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ఒక టీచర్ ఉన్నారు.