పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి.
రాజౌరీ జిల్లాలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖెరీ సెక్టార్లోని ఫార్వర్డ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు వెల్లడించారు. అయితే భారత సైన్యం ఈ కాల్పులను దీటుగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేశారు. పాక్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జేసీఓ.. అనంతరం మరణించినట్లు తెలిపారు. పాకిస్థాన్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని.. అయితే పూర్తి వివరాలు తెలియలేదని అన్నారు.
నాలుగు రోజుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి. ఆగస్టు 30న పాక్ దుస్సాహసానికి నౌషీరా సెక్టార్లో ఓ జేసీఓ ప్రాణాలు కోల్పోయారు.