దేశ మొట్టమొదటి త్రివిధ దళాల ప్రధానాధికారి నియమితులైన జనరల్ బిపిన్ రావత్.. ఇవాళ సైన్యాధ్యక్ష పదవీ విరమణ చేశారు. రేపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీడీఎస్ పదవికి గరిష్ఠ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే.. 28వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సైన్యాధిపతిగా సెలవు.. సీడీఎస్‌గా రేపు రావత్ బాధ్యతలు - రావత్
సైన్యాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ ఇవాళ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 28వ సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ విధులు నిర్వర్తిస్తారు.
సైన్యాధిపతిగా పదవీ విరమణ చేయడానికి ముందు.. దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు రావత్. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికులందరికీ కృతజ్ఞతలతో పాటు నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నరవణేకు అభినందనలు తెలిపారు. దేశభద్రత కోసం ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు రావత్.
" ఎన్నో సవాళ్ల మధ్య ధైర్యంగా విధులు నిర్వహిస్తూ.. సైనిక సంప్రదాయాలను కొనసాగిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఉత్తర, పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో చలికాలంలో అతిశీతల గాలులు వీస్తున్నా ఎలాంటి సంకోచం లేకుండా దృఢనిశ్చయంతో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా."
- బిపిన్ రావత్
TAGGED:
రావత్