తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శతఘ్నులతో సైన్యం దాడి- 10 మంది పాక్ జవాన్లు హతం! - ఆర్మీ న్యూస్​

భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పన్నాగాన్ని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పాక్​ ఆక్రమిత కశ్మీర్‌లోని సైనిక పోస్టులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని శతఘ్నులతో విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో 6-10 మంది పాక్​ సైనికులు హతమయ్యారని సైన్యాధిపతి బిపిన్ రావత్ తెలిపారు.

బిపిన్ రావత్​

By

Published : Oct 20, 2019, 7:46 PM IST

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపి పాకిస్థాన్‌ విధ్వంసానికి యత్నిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న వేళ...దాయాది దేశం చేసిన అలాంటి ప్రయత్నాన్ని భారత సైన్యం వమ్ము చేసింది.

పాక్ సైనిక కేంద్రాలు, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం శతఘ్నులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 6-10 మంది పాక్ సైనికులు మరణించినట్లు భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్ తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న రావత్​

" పాకిస్థాన్ సైన్యానికి, ఉగ్రశిబిరాలకు భారీ నష్టం వాటిల్లినట్ట మాకు కచ్చితమైన సమాచారం అందింది. దాడిలో 6-10 మంది పాక్​ సైనికులు మరణించారు. అదే సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. తీవ్రవాదుల మరణాలకు సంబంధించి సమాచారం ఇంకా అందుతోంది. ఆ వివరాలు తరువాత తెలియజేస్తాం. 3 ఉగ్రశిబిరాలు ధ్వంసమయ్యాయి. పాక్​ ఇదే తరహా కవ్వింపు చర్యలకు పాల్పడినంత కాలం మేం దీటుగా బదులిస్తూనే ఉంటాం."

-బిపిన్​ రావత్​, భారత సైన్యాధిపతి

పాక్ కవ్వింపు చర్యలు

జమ్ముకశ్మీర్‌లోని తంగ్దర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులను పంపే ప్రయత్నాల్లో భాగంగా భారత సైన్యం దృష్టి మరల్చేందుకు యత్నించిన పాక్‌ జవాన్లు....ఈరోజు ఉదయం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు అమరులు కాగా, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. వెంటనే ప్రతీకార దాడులు ప్రారంభించింది. తంగ్దర్‌ సెక్టార్‌కు ఎదురుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని వారి సైనిక కేంద్రాలు, ఉగ్ర శిబిరాలపై దాడికి దిగింది. పీవోకేలోని జురా, అతుమ్‌ఖామ్‌, కుందల్‌ సాహి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపింది. భారీగా ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో శతఘ్నులతో భీకరంగా విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో 6-10 మంది పాక్ సైనికులు మరణించినట్లు రావత్​ స్పష్టం చేశారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారన్న దానిపై స్పష్టత లేదు. పాక్‌ సైన్యం, ఉగ్రవాదులకు చెందిన 3 లాంచ్‌ప్యాడ్‌లు ధ్వంసమయ్యాయి. భారీగా నష్టం వాటిల్లింది.


పాక్ బుకాయింపు

భారత సైన్యం దాడి తర్వాత పాక్‌ బుకాయింపులకు దిగింది. తమ దాడిలో 9 మంది భారత జవాన్లు అమరులయ్యారని, మరికొంత మంది గాయపడ్డారని పాక్‌ సైన్యం ప్రకటించగా....భారత సైన్యం దీన్ని ఖండించింది.

సరిహద్దులో అప్రమత్తత

తాజా పరిస్ధితుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద సైన్యం అప్రమత్తమైంది. రాజస్థాన్‌లోని జైస్మలేర్‌ సహా సరిహద్దుల వద్ద జవాన్లు అప్రమత్తంగా ఉండాలని సైన్యం సూచించింది. సరిహద్దుల ద్వారా పాక్‌ సైన్యం ఉగ్రవాదులకు సహకరించే చర్యలకు దిగితే స్పందించే హక్కు భారత్‌కు ఎప్పటికీ ఉంటుందని భారత సైన్యం స్పష్టం చేసింది.

పరిస్థితిపై రక్షణమంత్రి ఆరా

తాజా ఘటనల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరిస్ధితిపై ఆరా తీశారు. సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌తో మాట్లాడిన రాజ్‌నాథ్‌...పరిస్ధితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'మహా'పోరు: ఓట్ల పండుగకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details