ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న వేళ.. 'పీఓకే'పై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్. పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌ను తిరిగి భారత్ సొంతం చేసేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఇమ్రాన్ సర్కారుకు గట్టి సంకేతాలిచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. పీఓకేను తిరిగి పొందడమే మోదీ ప్రభుత్వ తదుపరి ధ్యేయమన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు రావత్.
'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్
15:26 September 12
'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్
" పీఓకేపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానిది. సర్కారు ఏ ఆదేశాలిస్తే వాటి అనుసారమే ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి. సైన్యం ఏ చర్యకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది."
- బిపిన్ రావత్, భారత సైన్యాధ్యక్షుడు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పీఓకేను తిరిగిపొందడమే ప్రభుత్వ లక్ష్యమని బుధవారమే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయం భాజపా నిబద్ధత మాత్రమే కాదన్న ఆయన.. 1994లో అప్పటి ప్రధాని నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ఇది కూడా ఓ భాగమని గుర్తుచేశారు.