భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే.. నవంబర్ 4 నుంచి 6 మధ్య నేపాల్‌లో పర్యటించనున్నారు. రక్షణ, భద్రతా అంశాలపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. నేపాల్ రక్షణ మంత్రి ఈశ్వర్ పోఖ్రెల్, ఆర్మీ చీఫ్ పూర్ణ చంద్ర థాపాతోనూ.. నరవాణే భేటీ కానున్నారు.
మూడు రోజుల పర్యటనలో..
నవంబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత-నేపాల్ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరగనున్నాయి. 1950లో ప్రారంభమైన పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జనరల్ నరవాణేకు నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 'జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ' గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం కాఠ్మాండులో జరగనుంది. భారత్ కూడా 'జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ' గౌరవ ర్యాంకును నేపాల్ ఆర్మీ చీఫ్‌కు ప్రదానం చేస్తుంది.
ఈ మధ్య కాలంలో ఇరుదేశాలకు సరిహద్దులు సహా నూతన మ్యాప్ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఇరువురికీ దాదాపు 1800 కి.మీ మేర సరహద్దు ఉంది. వాటిపైనా చర్చలు జరగనున్నాయి.
కొత్త మ్యాప్ తర్వాత తొలిసారి...
భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ను విడుదల చేశాక.. ఇరుదేశాల మధ్య జరుగుతున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే.
సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు నెరిపేందుకు నరవాణే పర్యటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్థాన్ దేశాల్లో పర్యటించి పలు అంశాల్లో భారత్ వైఖరిని తెలియజేశారు. ఈ నెలలోనే మయన్మార్ వెళ్లిన నరవాణే.. ఆ దేశ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ శాన్ సూచీతో భేటీ అయ్యారు. అనంతరం ఆ దేశానికి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇరుదేశాల మధ్య సైనిక, రక్షణ సంబంధాల మెరుగుదలకు కృషి చేశారు.
నేపాల్ ప్రత్యేకమే..
సరిహద్దుల్లో ఒత్తిడి పెంచుతున్న చైనా.. భారత సరిహద్దు దేశాలను తమ వైపు తిప్పుకొని మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో కలిసి రెండు వైపుల నుంచి దాడి చేస్తున్న చైనా.. నేపాల్లోనూ కాలుమోపి త్రిముఖ దాడి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ హిమాలయ దేశంలో పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. వాటిపై నేపాల్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అయితే చైనాకు దీటైన ప్రత్యర్థి మనమే కావడం వల్ల.. నేపాల్‌కు అండగా ఉండి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించనుంది భారత్.
సముద్రం లేని నేపాల్ సరకు రవాణా కోసం ముఖ్యంగా భారత్‌పైనే ఆధారపడుతుంది. అందుకే ఇరుదేశాల మధ్య వాణిజ్యం కీలకంగానే ఉంది. 2017లో దాదాపు 420.18 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్‌కు సరఫరా చేసి ఆర్థికంగానూ బలపడింది నేపాల్.
ఇదీ చూడండి: