తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు, గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలతో జరిగిన రెండు వేర్వేరు ఘర్షణల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఐదుగురు సైనికులకు... సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే ప్రశంసాపత్రాలు అందజేశారు. సదరు సైనికుల వివరాలను మాత్రం సైన్యం వెల్లడించలేదు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో... సైనిక సన్నద్ధతను సమీక్షించేందుకుగాను నరవాణే రెండు రోజులుగా లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. నార్త్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులతో కలిసి సరిహద్దుల్లోని పరిస్థితులను ఆర్మీ చీఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగానే తూర్పు లద్దాఖ్‌లోని ఓ స్థావరంలో ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జిలను స్వయంగా తొడిగారు.