జమ్ముకశ్మీర్లో పురుటినొప్పులతో అవస్థలు పడుతున్న ఓ మహిళను ఖరియత్ బృందానికి చెందిన ఆర్మీ సిబ్బంది రక్షించారు. భారీగా మంచు పేరుకుపోయిన దారిలో 5 కిలోమీటర్ల మేర గర్భిణిని భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రికి చేర్చి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
సవాళ్లకు ఎదురొడ్డి..
దక్షిణ కశ్మీర్ బారాముల్లాలోని దార్ద్పొరా గ్రామానికి చెందిన షామిమా.. పురుటినొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం అందగానే వెంటనే స్పందించింది ఖరియత్ బృందం. అయితే.. మహిళను ఆస్పత్రికి చేర్చేందుకు జవాన్లకు అడుగడుగున సవాళ్లు ఎదురయ్యాయి. కఠిన పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది... అప్పటికప్పుడు మూడు బృందాలుగా విడిపోయారు. గర్భిణిని తీసుకురావడానికి ఒక బృందం.. మంచు తొలగించే పనిలో ఉండగా... హెలికాఫ్టర్ దిగడానికి అనువుగా హెలిప్యాడ్ని సిద్ధం చేశారు మరో బృందం సభ్యులు. చివరగా ఆ ప్రాంతం నుంచి కనిస్పొరా ప్రాంతం వరకు రోడ్డు మార్గంలో ఉన్న మంచును తొలగించి అంబులెన్సుకు దారిచ్చింది మూడో బృందం.
ఆరు గంటలు.. 100 మంది సిబ్బంది
దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో 100 మంది ఆర్మీ సిబ్బంది, 25 మంది స్థానికులు భాగస్వాములయ్యారు. మార్గమధ్యలో ఉప్నోలా ప్రాంతం వద్ద గర్భిణి పరిస్థితి కాస్త కుదుటపడటం వల్ల ఆమెను ఆర్మీ అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన షామిమా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.